అవరోధాలు ఎదిరించి మంత్రిగా నిలబడ్డ నేత పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో, ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రజాగర్జన భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రౌండ్ ఎంట్రీ ఇచ్చారు.

Update: 2023-12-08 05:12 GMT

దిశ, తిరుమలాయపాలెం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆంక్షల మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో, ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రజాగర్జన భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రౌండ్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీలో చేరిన అనతి కాలంలోనే జూలై నాలుగో వారంలో, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యునిగా ఏఐసీసీ నియమించింది. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నమ్మకస్తుడిగా పని చేస్తూ.. కాంగ్రెస్ అధినాయకత్వం పై విధేయుడుగా గుర్తింపు పొందడంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి. టీపీసీసీలో మొదలైన ఆయన ప్రస్థానం, పార్టీలో చేరి 100 రోజులు కాకముందే, ఏఐసీసీ స్థాయికి ఎదిగిన తీరు, కాంగ్రెస్ పార్టీ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓడించి, నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో భారీ నీటిపారదల శాఖ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయో డేటా పై "దిశ"పత్రిక ప్రత్యేక కథనం.

పొంగులేటి జననం..

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని, ఖమ్మం జిల్లా, కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో 1956, అక్టోబర్ 28న రాఘవ రెడ్డి, స్వరాజ్యం పుణ్యదంపతులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మించారు.

విద్యాభ్యాసం..

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా దూరవిద్యలో బీఏ డిగ్రీ, ఏలూరులోని సీఆర్ రెడ్డి కళాశాలలో ఎల్ఎల్బీ విద్యను పూర్తి చేశారు.

వివాహం..

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలంలోని ప్రగడవరం గ్రామానికి చెందిన మాధురితో 1992న వివాహం జరిగింది. శ్రీనివాసరెడ్డి - మాధురి దంపతులకు కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్ని ఉన్నారు.

వ్యాపార జీవితం..

1985లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో గ్రామోదయ పథకంలో, పేరువంచ మేజర్ పై క్రాస్ వాల్ నిర్మాణం చేశారు. ఆ క్రాస్ నిర్మాణం వల్ల అప్పుడు 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టుర్ గా మారి, ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేసి, అంచలంచలుగా ఎదిగారు.

తల్లిదండ్రుల పేరున సేవా కార్యక్రమాలు..

తల్లిదండ్రులు రాజారెడ్డి - స్వరాజ్యం పేరుతో పీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పొంగులేటి ప్రజలకు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, నిరుపేద విద్యార్థిని - విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం. ఇలా అనేక సేవా కార్యక్రమాలు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా నేటికి అందిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం..

దిగివంత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం, ఆయన కుమారుడు వైయస్ జగన్ రెడ్డి స్థాపించిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో 2013, ఫిబ్రవరి 23న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరారు. ఆ తరువాత 2014లో జరిగిన ఖమ్మం 16వ పార్లమెంటు ఎన్నికల్లో 11.974 ఓట్ల మెజార్టీతో, ఇప్పటి ఎంపీ నామ నాగేశ్వరరావు పై గెలుపొందడమే కాక, తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పొంగులేటి గెలిపించుకున్నాడు.

2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి మరణాంతరం, 2016లో పాలేరులో జరిగిన ఉపఎన్నికల్లో సందర్భంగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు, పొంగులేటి బీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత 2018, 2019లో జరిగిన పలుఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు.

పదవులు..

2014 సెప్టెంబర్ 1 నుండి, 2019 వరకు రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశారు.

అణిచివేతతో.. తిరుగుబాటు..

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొంగులేటి, ఏడేళ్లుగా పార్టీలో విధేయతగా ఉన్నాడు. పార్టీ అభివృద్ధితోపాటు, ఎన్నికలు ఏవైనా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పొంగులేటి కృషి చేశాడు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తనకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ.. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గల్లో, తన అనుచరులతో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ.. ఏప్రిల్ 10వ తేదీ, 2023న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల మధ్య, పొంగులేటి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని 56వేల ఓట్ల భారీ మెజార్టీతో ఊహించని విధంగా కందాళ ఓడించాడు.

పార్లమెంటు టూ, అసెంబ్లీ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ తరువాత ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనలేదు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, పొంగులేటి అనే వ్యక్తిని రాజకీయంగా హత్య చేస్తున్నాడని పలుమార్లు ఆరోపించారు. పొంగులేటి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాకప్పుకున్నారు. అనతికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్ద దింపుడే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా పొంగులేటి పర్యటిస్తూ.. కేసీఆర్ వైఫల్యాలు ప్రజలకు వివరించారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థులను, ఏ ఒక్కరిని అసెంబ్లీ గేటు తాకనివ్వనని, పదికి పది సీట్లు గెలుస్తామన్న శపథం సైతం నిరూపించుకున్నారు. అనుకున్న విధంగానే ఈ అసంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడించి, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గురువారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన క్యాబినెట్ లో పొంగులేటి మంత్రిగా నియమితులయ్యారు. పొంగులేటి తన లక్ష్య సాధనలో అవరోధాలు ఎదురైన వాటిని ఎదిరించి నేడు మంత్రిగా నిలబడి, తన మార్కును చూపించాడు.

Tags:    

Similar News