అంతా.. అధికారుల కనుసన్నల్లోనే ?

నీతి నిజాయితీలతో, నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ తాము పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వైరా మున్సిపాలిటీ అధికారులు ఆ 70 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయం చర్చనీయాంశమైంది.

Update: 2023-03-13 03:05 GMT

దిశ, వైరా: నీతి నిజాయితీలతో, నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ తాము పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వైరా మున్సిపాలిటీ అధికారులు ఆ 70 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయం చర్చనీయాంశమైంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం గ్రామంలో కౌన్సిల్ అనుమతి లేకుండా, ఇంజనీరింగ్ అధికారుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండానే మంచినీటి వాటర్ ట్యాంక్ ను కూల్చి వేసిన విషయం పాఠకులకు విదితమే. గతంలో ఈ ట్యాంక్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఆ స్థలాన్ని అప్పగించేందుకే మున్సిపాలిటీలోని కొంతమంది ప్రమేయంతో మంచినీటి ట్యాంక్ ను కూలగొట్టారనే విషయం బహిరంగ రహస్యమే. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని వైరాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది.

ఆది నుంచి అంతం వరకు ఈ వ్యవహారాన్ని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అన్నీ తానై నడిపించాడని గ్రామస్తులతో పాటు మున్సిపాలిటీలోని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. 2022 డిసెంబర్ 12వ తేదీన ఈ మంచినీటి ట్యాంకును ధ్వంసం చేశారు. ఐరన్ స్క్రాప్ తో పాటు వాటర్ పైపులు, ఇతర ఇనుప సామాగ్రిని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి విక్రయించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ ట్యాంక్ కూల్చివేతపై ఫిబ్రవరి 22వ తేదీన కలెక్టర్ వి పి గౌతమ్ కు 16 మంది కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.

కౌన్సిలర్లు ఫిర్యాదు చేసేంతవరకు ట్యాంక్ కూల్చివేత వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులకు కనీస సమాచారం మున్సిపాలిటీ అధికారులు అందించలేదు. ట్యాంక్ కూల్చివేసిన రోజు నుంచి కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రోజు వరకు 70 రోజులు దాటింది. ఈ 70 రోజులు మున్సిపాలిటీ అధికారులు ట్యాంక్ కూల్చివేత వివరాలను ఉన్నతాధికారులకు తెలియపరచకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలకు దారితీస్తున్నది.

జవాబు ఏది..?

సోమవరం గ్రామంలో తమకు తెలియకుండానే మంచినీటి ట్యాంకును కూల్చి వేశారని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసేంతవరకు ఈ విషయం తమకు తెలియదని అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే అధికారులు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. 70 రోజులు పాటు ట్యాంక్ కూల్చివేత విషయం తెలియదని అధికారులు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు. వైరా మున్సిపాలిటీలో సోమవారం గ్రామానికి చెందిన పది మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 70రోజులుగా ఆ కార్మికులు ఈ విషయాన్ని అధికారులకు తెలియపరచకుండా ఉంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

నిత్యం మున్సిపాలిటీ కార్మికులు, పారిశుధ్య పనులకు వెళ్తుంటారు. ట్యాంక్ కూల్చిన విషయం ఆ కార్మికులు కూడా అధికారులకు చెప్పలేదనే అనుకోవాలా....? ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ను నియమించారు....? మరి ఈ ట్యాంక్ కూల్చేసిన విషయం సదరు వార్డులోని వార్డు ఆఫీసర్ కూడా అధికారులకు తెలపలేదా.....? సోమవారం గ్రామంలో మంచినీటి పంపు ఆపరేటర్ పనిచేస్తున్నారు.... పంప్ ఆపరేటర్ అయినా ట్యాంక్ కూల్చేసిన విషయాన్ని మున్సిపాలిటీ అధికారులకు చెప్పలేదా...? నిరంతరం మున్సిపాలిటీలో పర్యటన చేసే ఉన్నతాధికారి ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారా...? సూదో, గుండు పిన్నో పోయిందంటే మాకు కనిపించలేదంటే ప్రజలు నమ్ముతారు కానీ..గ్రామ నడిబొడ్డున 900000 లీటర్ల మంచి నీటి ట్యాంక్ కూల్చివేత విషయం తమకు తెలియదని అధికారులు చెప్పినా కనీస అవగాహన ఉన్న ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు.

ఇంత సంఘటన కూడా తమకు తెలియదని అధికారులు చెబుతున్నారంటే విధులు పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో మున్సిపాలిటీ అధికారుల సహకారం పరోక్షంగా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో మంచినీటి ట్యాంకు కూల్చి స్థలాన్ని కోల్పోవడంతో వైరా మున్సిపాలిటీ రూ.40 లక్షలకు పైగానే నష్టం వాటిల్లినట్లు అయింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ఈ వ్యవహారంలో "మౌనమేలనోయి" అనే విధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News