ఉద్యమ ఖిల్లా ఖమ్మంలో కమలం వికసించడం సాధ్యమేనా

ఉద్యమ ఖిల్లా గా పేరుగాంచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలోపేతానికి అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ పటిష్టతకు ఇప్పటి నుంచే కలిసికట్టుగా కృషి చేయాలని అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం.

Update: 2025-03-27 01:56 GMT
ఉద్యమ ఖిల్లా ఖమ్మంలో కమలం వికసించడం సాధ్యమేనా
  • whatsapp icon

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకునే దిశ చర్యలు తీసుకుంటుందా? నాయకత్వ లేమితో ముక్కుతూ మూలుగుతున్న ఆ పార్టీ ఇకనైనా బలోపేతం అవుతుందా..? రెండు జిల్లాల అధ్యక్షుల మార్పుతో పార్టీని జిల్లాలో స్ట్రెంథెన్ చేయాలని అధిష్టానం భావిస్తుందా? మున్ముందు ప్రజల్లో ఉండి పార్టీకి జవతసత్వాలు నింపడమే కాకుండా కేడర్‌ను సైతం పెంచుకోవాలని అనుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అందులో భాగంగానే కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులకు కీలకమైన సూచనలు చేసినట్లు సమాచారం.

దిశ, ఖమ్మం బ్యూరో: ఉద్యమ ఖిల్లా గా పేరుగాంచిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలోపేతానికి అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ పటిష్టతకు ఇప్పటి నుంచే కలిసికట్టుగా కృషి చేయాలని అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేసి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు నెల్లూరి కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలను అధ్యక్షులుగా కొద్దిరోజుల క్రితం ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఉన్న కొద్ది క్యాడర్‌‌లో జోష్ వచ్చినా.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ అగ్రనేతలు మాత్రం ఉమ్మడి జిల్లాపై సీరియస్‌గానే దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రాజకీయ సమీకరణలో భాగంగా బీజేపీ జిల్లాలో తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు టాక్. బలమైన నేతలను పార్టీలోకి రప్పించి పట్టు సాధించానే లక్ష్యంతో ఉన్నట్లు అందులో భాగంగా రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గత ఏడాది నుంచే ఉమ్మడి జిల్లాలో అధ్యక్షుల మార్పును అనివార్యంగా భావించిన అధిష్టానం.. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడి కొత్త అధ్యక్షులను తాజాగా ఎంపిక చేసింది.

ఖమ్మం జిల్లాకు నెల్లూరి కోటేశ్వరరావు..

కొణిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన నెల్లూరి కోటేశ్వరరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ.. ఈ విషయమై భారీ కసరత్తే చేసింది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేసినా.. అధిష్టానం మాత్రం నెల్లూరునే ఖాయం చేసింది. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నెల్లూరు అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బీజేపీ మండల కో కన్వీనర్‌గా, ఖమ్మం జిల్లా విస్తారక్‌గా, వైరా అసెంబ్లీ కన్వీనర్‌గా పనిచేసిన కోటేశ్వర్‌రావు అనేక ప్రజా సమస్యలపై పోరాడిన అనుభవం ఉంది. గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడమే కాకుండా.. యువతను ఆకర్శించడానికి ప్రణాళికలు రూపొందించి ఖమ్మంలో కమలం జెండాను ఎగరేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.

భద్రాద్రి జిల్లాకు బైరెడ్డి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పాల్వంచకు చెందిన బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపిక చేసిన ఆ పార్టీ.. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవమున్న బైరెడ్డికి రెండోసారి అవకాశం కల్పించి మరింత బాధ్యతను పార్టీ పెంచింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తానని, గ్రామస్థాయిలో పార్టీ ప్రాభవం పుంజుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రణాళికతో ముందుకు సాగుతారా..

గతంలో ఉన్న నాయకులు పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదన్న అపవాదు తో పాటు.. అధికారంలో ఉన్న నాయకులతో అంటకాగినట్లు, లోపాయికారి ఒప్పందాలతో కేడర్‌ను నిర్వీర్యం చేశారనే అరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల సమయంలో రంగంలోకి దిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తాండ్ర వినోద్‌రావు పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కృషి చేశారని, అంతకు ముందు ఎవరూ అంతగా దృష్టి సారించలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు సైతం పార్టీ పటిష్టతపై సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని, ప్రధానంగా యువతను ఆకర్శించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా పార్టీలో ఉన్న ప్రధాన సీనియర్ నాయకులు బాధ్యతలు భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ నిర్ణయాన్ని అంగీకరించి ప్రధాన నాయకులు ఉమ్మడి జిల్లాలో కలిసికట్టుగా ముందుకు సాగుతారా అన్నది ముందు ముందు తేలనుంది.

Similar News