Mining : అక్రమ మైనింగ్​.. క్వారీ లేకుండానే క్రషర్​నిర్వహణ

ఖమ్మం రూరల్​ మండలంలో అనుమతులు

Update: 2024-08-01 02:47 GMT

దిశ, ఖమ్మం రూరల్​: ఖమ్మం రూరల్​ మండలంలో అనుమతులు లేకుండానే జోరుగా క్రషర్​మిల్లింగ్​చేస్తున్నారు. గనుల శాఖ నుంచి నామమాత్రపు అనుమతి తీసుకొని విచ్చలవిడిగా దందాను కొనసాగిస్తున్నారు. మైనింగ్​ఆఫీసర్లు, విజిలెన్స్​ అధికారులు అటూవైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి అనుచరుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఈ అక్రమ దందాను సాగిస్తున్నాడు. క్రషర్​ నిర్వహణలో కనీస నిబంధనలను పాటించడం లేదు. అక్రమ మైనింగ్​మా జాగీరు అంటూ.. మమ్మల్ని ఎవరూ ఆపలేరని ఇష్టం వచ్చినట్లు దందాను నిర్వహిస్తున్నాడు.

అనుమతి జానెడు.. అక్రమం మూరెడు..

రూరల్​ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వె నెం.178, 199లో క్రషర్​ అనుమతి కోసం టీఎస్​ఐపాస్‌కు భద్రాద్రి రాక్​అండ్​ మినరల్స్​ పేరు మీద కొంత వరకు దరఖాస్తు చేసుకున్నారు. క్రషర్​నిర్వహణకు రాళ్ల తరలింపు ఎక్కడ నుంచి తీసుకవస్తారో సూచించకుండానే పక్కనే ఉన్న క్వారీ నుంచి డంపింగ్​రాళ్లను ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి మాజీ మంత్రి అనుచరుడి హస్తం ఉంది. ఆయన చెబితే ఏ అధికారైనా వినాల్సిందే. మైనింగ్​శాఖాధికారులు కనీస నిబంధనలు పాటించని ఈక్రషర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియాల్సి ఉంది.

నిబంధనలు గాలికి..

క్రషర్​నిర్వహణ మైనింగ్​శాఖ తమకు కేటాయించిన స్థలంలో క్రషర్, క్వారీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించాల్సిన ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని కొలిచే యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దూమ్ముధూళి రాకుండా ఎప్పుడు నీటిని వెదజల్లేలా, దుమ్మ గాలిలోకి లేవకుండా క్రషర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఖనిజాలు, సహజ వనరులను నిబంధనల ప్రకారం లీజుకు అనుమతులు లేకుండా నిర్వహించడమే కాకుండా ప్రకృతి అందించిన వనరులను కొల్లగొడుతూ రూ.కోట్ల రూపాయల సంపదను దోచుకుంటున్నారు.

అక్రమంగా క్రషర్ నిర్వహణ..

క్వారీ లేకుండా క్రషర్​ నిర్వహణ ఎలా సాధ్యం అనేది ఇక్కడ ప్రశ్న. గ్రానైట్​ క్వారీలో నుంచి వచ్చిన డంపింగ్​రాళ్లను ఎక్కడి నుంచి ఇక్కడికి ఎటువంటి అనుమతి, రాయల్టీ చెల్లించకుండా అక్రమంగా క్రషర్​నిర్వహిస్తున్నారు. రాక్​ లేకుండా క్రషర్​అనుమతి ఎలా ఇచ్చారో మైనింగ్​శాఖకే తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి అనుచరుడు చెప్పిందే వేదంగా అధికారులు వ్యవహరించడంతో ఇటువంటి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూడ అదే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు లేని క్రషర్‌ను వెంటను సీజ్​ చేసి ప్రభుత్వ సంపదను, శాఖకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడాలని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News