నేనింతే..! పత్రికల్లో ప్రచురిస్తే భయపడతానా?

‘బట్టతలకు వెంట్రుకలు మొలిపిస్తా’ అంటూ జనాలకు కుచ్చుటోపి పెడుతోన్న ఏన్కూర్ గాయత్రి ప్రాథమిక చికిత్స కేంద్రం నిర్వాహకుడు కొలిశెట్టి నరేష్ గురించి ‘దిశ’లో గురువారం కథనం ప్రచురితం కాగా.. అది చూసిన అతడు నేనింతేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు.

Update: 2024-09-27 03:39 GMT

‘బట్టతలకు వెంట్రుకలు మొలిపిస్తా’ అంటూ జనాలకు కుచ్చుటోపి పెడుతోన్న ఏన్కూర్ గాయత్రి ప్రాథమిక చికిత్స కేంద్రం నిర్వాహకుడు కొలిశెట్టి నరేష్ గురించి ‘దిశ’లో గురువారం కథనం ప్రచురితం కాగా.. అది చూసిన అతడు నేనింతేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. తన దగ్గరికి ఏ అధికారి రాడని, ఒకవేళ వచ్చి సీజ్ చేసినా గంటల వ్యవధిలోనే తన క్లినిక్‌ను తెరింపించుకునే సత్తా ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నకిలీ వైద్యం చేస్తూ జనాలను నట్టేటా ముంచుతున్నా ఎవరూ చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న కారణం ఏంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా ఈ దందా కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా కలెక్టర్ తగిన విచారణ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. - దిశ బ్యూరో, ఖమ్మం

ఏళ్లకు ఏళ్లు చదివి ప్రాక్టీస్ చేసి వైద్యం చేస్తున్న అసలు డాక్టర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా నకిలీ వైద్యం చేస్తూ ‘సర్వరోగ నివారిణి’ తానే అంటూ ఏన్కూర్‌లో వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ కొలిశెట్టి నరేష్ వ్యవహారం వివాదాస్పందం అవుతోంది. 12 ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా గాయత్రీ ప్రాథమిక చికిత్స కేంద్రం నిర్వహిస్తూ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆర్ఎంపీ తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. బట్టతలకు వెంట్రుకలు మొలిపిస్తానని, గైనకాలజీ ట్రీట్‌మెంట్ చేస్తానని, దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తానని పేషంట్ల దగ్గర రూ.వేలకు వేలు వసూలు చేస్తూ అడ్డగోలుగా దోచేస్తున్న సదరు ఆర్ఎంపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ‘దిశ’లో గురువారం కథనం ప్రచురితం కాగానే.. అనేక మంది బాధితులు ఫోన్లో జరిగిన విషయాన్ని వెల్లడించి ఆందోళన వ్యక్తం చేశారు. తాము నిష్ణాతుడైన డాక్టర్ వద్ద ట్రీట్‌మెంట్ చేయించుకున్నట్లు భావించామని, ఇంత మోసం చేస్తాడని ఊహించలేదని వాపోతున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా ఎలాంటి రిజల్ట్ కనపడకపోవడంతో అనేక సార్లు నిలదీశామని కానీ, సమయం పడుతుందంటూ కాలయాపన చేస్తూ. రూ.వేలాది రూపాయల మెడిసిన్ రాశాడని పేర్కొన్నారు. ఇప్పుడు సైడ్ ఎఫక్ట్స్ వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ బాధితురాలి ఆవేదన ఇలా..

హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ యువతి తన భర్తతో కలిసి రెండు రోజుల క్రితం ఏన్కూర్‌లోని ఆర్ఎంపీ నరేష్‌ను కలిసింది. జుట్టు అధికంగా రాలుతుందని ఇన్‌స్టా‌గ్రామ్‌లో చూసి అక్కడికి వచ్చినట్లుగా తెలిపింది. వివిధ పరీక్షలు చేసి జుట్టు రాలకుండా తగిన ట్రీట్‌మెంట్ చేస్తానని, తప్పకుండా జుట్టు రాలుడు ఆగుతుందని నరేష్ నమ్మించాడు. ఉపయోగం లేని రూ.4 వేల విలువైన టెస్టులు రాశాడు. పక్కనే ఉన్న ల్యాబ్‌లో టెస్ట్‌లు చేయించుకోవాల్సిందిగా సూచించాడు. రిపోర్టులు వచ్చిన అనంతరం వాటిని చూసి రూ.12 వేల విలువైన ఆయిల్స్ రాశాడని బాధితురాలు వాపోయింది. ట్రీట్‌మెంట్ సమయంలో ప్యాన్ ట్యాబ్ ట్యాబ్లెట్ రాయడంతో జుట్టు రాలడానికి, ప్యాన్ ట్యాబ్‌కు సంబంధం ఏంటని ఆమె నిలదీసింది. అయితే, దాని వల్ల కూడా ఉపయోగం ఉంటుందని ఆర్ఎంపీ నరేష్ ఆమెను నమ్మించాడు.

అదేవిధంగా మరో రూ.12 వేల విలువైన మెడిసిన్స్ కూడా తీసుకుంది. మరిసటి రోజు ఆ మెడిసిన్ గురించి ఆరా తీసిన యువతి అవంతా ఫేక్ అని తేలడం, ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలు కూడా నకిలీవని తేలడంతో మెడిసిన్ రిటర్న్ తీసుకోవాలని ఫోన్ చేసింది. దీంతో ఆ ఆర్ఎంపీ మెడిసిన్స్ వెనక్కి తీసుకోవడం కుదరదని, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండంటూ ఫోన్ కట్ చేశాడు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు, సూర్యాపేట‌కు చెందిన ఇద్దరు, కోదాడకు చెందిన ఒకరు ‘దిశ’కు ఫోన్ చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు. నిజంగానే ఆర్ఎంపీ ఇచ్చిన మందులతో ఉపశమనం లభిస్తుందని భావించామని, కానీ ఆ ట్రీట్‌మెంట్ వల్ల ఎలాంటి లాభం లేదనే విషయం తమకు అర్థమైందని అన్నారు. రూ.వేల మెడిసిన్లు రాస్తుంటేనే అనుమానం వచ్చిందని, కేవలం డబ్బు కోసమే ఆ దందా నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఇంత జరుగుతున్నా..

గురువారం ‘దిశ’లో కథనం ప్రచురితమై కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినా సదరు ఆర్ఎంపీ ధీమా మాత్రం సడలలేదు. ఎలాంటి అనుమతులు లేకపోయినా వైద్యం చేయడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. ఎంతో ప్రావీణ్యం ఉన్న డాక్టర్లు చేయాల్సిన వైద్యం ఓ ఆర్ఎంపీ 12 ఏళ్లుగా చూస్తూ అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలిచినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నకిలీ వైద్యం చేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్న నరేష్ వ్యవహార శైలి‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కానీ, క్లినిక్‌ను నడపడం వల్ల తనకు ఏమి కాదని, అధికారులు కూడా తననేమీ చేయలేరనే ధీమాను ఆర్ఎంపీ రమేష్‌ వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.


Similar News