హాస్టల్ విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం ముఖ్యం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల సంబంధిత హెచ్ఎంలు వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ జాగ్రత్త వహించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
దిశ, భద్రాచలం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల సంబంధిత హెచ్ఎంలు వార్డెన్లు, ప్రిన్సిపాల్స్ జాగ్రత్త వహించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం ఆని అన్నారు. మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహారంతో పాటు గుణాత్మకమైన విద్యను అందించి వారి భవిష్యత్తు బంగారు బాటలో నడిచేలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం సెక్రటేరియట్ లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి ఐటీడీఏ పీఓలు, డీడీట్రైబల్ వెల్ఫేర్లు, డీటీడీఓలు, ఆర్సీఓ గురుకులం, ఏటీడీవోలు, ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం నడుస్తున్నందున కొన్ని జిల్లాలలో వరదల వలన వాగులు, చెరువులు, కెనాల్స్ పొంగిపొర్లుతున్నాయని, వరద ప్రాంతాలలో ఉండే ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో చదివే విద్యార్థులను అటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అలాగే ఆశ్రమ పాఠశాల వసతి గృహాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ శరత్ మాట్లాడుతూ ప్రతి సెంటర్లో రాత్రిపూట ప్రత్యేక తరగతులు నిర్వహించే విధంగా ఐటీడీఏ పీఓ ద్వారా ఆదేశాలు జారీ చేయాలని, ఇన్స్పెక్షన్ రిజిస్టరు తప్పనిసరిగా నిర్వహించాలని, అలాగే మెనూకి సంబంధించిన వివరాలు ప్రతి పాఠశాల వసతి గృహం ముందు డిస్ప్లే చేయాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థిని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేయడమే కాక ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐ టీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సీఓ గురుకులం నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.