రేపే ఎన్నికలు.. గ్రామాల్లో 144 సెక్షన్​ అమలు

పాలేరు అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్​ కమిషన్​ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Update: 2023-11-29 12:28 GMT

దిశ, ఖమ్మం రూరల్ ​: పాలేరు అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్​ కమిషన్​ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోలింగ్​ స్టేషన్​లకు ఈవీఎంలను తరలించారు. నియోజకవర్గంలోని 27 రూట్లకు గాను 289 పోలింగ్​ స్టేషన్​లకు 1269 మందిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించారు. 318 మంది పోలింగ్​ ఆఫీసర్​లు, అసిస్టెంట్​ పోలింగ్​ ఆఫీసర్​లు 313 మంది, ఓ పీవోలు 638 మంది విధుల్లో పాల్గొననున్నారు. ఈ సారి ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ ఆదేశాల మేరకు పాలేరు నియోజకవర్గంలోని 289 పోలింగ్​ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆర్​వో రాజేశ్వరి తెలిపారు. రూరల్​ మండలంలోని గోళ్లపాడులో దివ్యాంగుల ఆదర్శ పోలింగ్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం రూరల్​ మండలంలోని మహిళా మోడల్​ పోలింగ్​ స్టేషన్ గా దానవాయిగూడెం పోలింగ్​ స్టేషన్ ను ఎంపిక చేశారు.

ఈ బూత్​లో 688 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుర్రలపాడు గ్రామంలో 134 బూత్​ను మోడల్​ మహిళా పోలింగ్​ బూత్ గా ఎంపిక చేశారు. ఇందులో 703 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రూరల్​ మండలంలోని మోడల్​ పోలింగ్​ స్టేషన్ లుగా తల్లంపాడు, కొండాపురం, నాయుడుపేట, కూసుమంచి మండలంలోని పాలేరు, నేలకొండపల్లి మండలంలోని భైరవుని పల్లి బూత్​లను మోడల్​ పోలింగ్​ బూత్​ల కింద ఎంపిక చేశారు. తిరుమాలయపాలెం మండలంలోని సుబ్లేడు, కూసుమంచిలోని గోరిలపాడుతండా, నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం పోలింగ్​ బూత్​లను మోడల్​ మహిళా పోలింగ్​ బూత్​ల కింద ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆర్​వో తెలిపారు.

ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోబోమని, ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని ఆర్​వో సూచించారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పు పై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఏవీ ఉండకూడదని, తెల్లకాగితం పై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల దగ్గరికి పోలింగ్‌ ఏజెంట్లు వెళ్లవద్దని, ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి ఫోన్‌ తీసుకొనిరావద్దని సూచించారు. ఓటింగ్‌ రహస్యంగా వేయాల్సి ఉంటుందని, ఓటును ఫొటో తీయడానికి కూడా వీలులేదని తెలిపారు.

రేపు సెలవు..

ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్‌ 1న స్పెషల్‌ క్యాజువల్‌ లీవుగా ప్రకటించారు.

Tags:    

Similar News