ముళ్లు లాంటి తుమ్మల కావాలా... పూలవంటి పువ్వాడ కావాలా
ఖమ్మం నగరం 31వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దండగల రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బోసు బొమ్మ సెంటర్లో వడ్డెర ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరం 31వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు దండగల రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బోసు బొమ్మ సెంటర్లో వడ్డెర ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షులు గుండాల కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పువ్వాడను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దండగల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ ఖమ్మం కు వలస పక్షులా వచ్చే నాయకులు అభివృద్ధికి ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు.
అదేవిధంగా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో తుమ్మల ఖమ్మం కు చేసింది ఏమిటని ఆయన ఇన్నేళ్లలో పదవుల కోసం తప్ప ప్రజా అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటు పడ లేదన్నారు. తుమ్మ చెట్టు లాంటి తుమ్మల ఖమ్మం కి కావాలా పువ్వులు, పండ్లు ఇచ్చే పువ్వాడ కావాలా అని ప్రజల్ని కోరారు. తాను స్థానిక నేతను కాబట్టి మీ అందరికీ తలలో నాలుకలా పనిచేసి ఖమ్మం నలు దిక్కులా అభివృద్ధి చేసి చూపిన ఘనత నాకే దక్కిందన్నారు. వడ్డెర జాతి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేశానని వడ్డెర కాలనీలో తాగునీరు, 24 గంటలు కరెంటు, డ్రైనేజీ వ్యవస్థ రూపుమాపడం, వడ్డెర్లో ఎక్కువమంది కాంట్రాక్టర్లకు చేయూతనందించడం జరిగిందన్నారు. మంత్రిగా ఉండి ప్రతి ఇంటికి సైకిల్ మీద వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశానన్నారు. ఇంత చేసిన తనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, వర్తక సంఘం కార్యదర్శి మెంతుల శ్రీశైలం, అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, కొప్పెర నరసింహారావు, నున్న మాధవరావు, ఎర్ర అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.