ప్రైవేట్ ఆస్పత్రులకు 'డెంగ్యూ ఫీవర్'..!

ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగ్యూ ఫీవర్ దందా విచ్చలవిడిగా

Update: 2024-08-30 01:44 GMT

దిశ, ఖమ్మం :  ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగ్యూ ఫీవర్ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి జ్వరాన్ని డెంగ్యూ ఫీవర్ తో పోలుస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు మిగతా జిల్లా కంటే ఉమ్మడి ఖమ్మం ఎక్కువగా నమోదు అయినట్లు అధికారుల నివేదిక ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో వైరల్ ఫీవర్‌లతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆర్ఎంపీ వైద్యులు సాయంతో ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్ల చిన్న జర్వాలకే ఇష్టానుసారంగా టేస్ట్ లు రాసి బాధితుల నుంచి పిండుకుంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైరల్ ఫీవర్ పై సీరియస్‌గా ఉన్నా.. ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ఇష్టానుసారంగా చికిత్సలు చేసి రోగులను మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రిలో ఇంత తతంగం జరుగుతున్నా ఇప్పటి వరకు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేసిన డెంగ్యూ, వైరల్ ఫీవర్‌లపై కట్టడి చేసిన సందర్భాలు లేకుండా పోయింది.

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదు కాలేదు. రెండు మూడు కేసులు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. కానీ ప్రైవేటు ఆస్పత్రిలో మాత్రం ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు జర్వంతో బాధితులను ఆస్పత్రిలో వైద్యులు ముందుగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అంటూ ఇష్టానుసారంగా పరీక్షలు చేయిస్తున్నారు. సాధారణంగా వైరల్ ఫీవర్లు ఉండటంతో నీరసంగా ఉంటుంది దాని సాకుతో ఆసుపత్రిలో అడ్మిట్ చేయించి చికిత్సలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో జనరల్ వార్డ్, ఐసీయూ వార్డులో రోగులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. డెంగ్యూ వైరస్ తో జిల్లాలో మరణాలు చోటు చేస్తున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ప్రవేట్ హాస్పిటల్‌లో డెంగ్యూ కేసులు ఉన్న వైద్యారోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా చికిత్సలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఉన్న ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు ఉన్నట్టు సమాచారం.

ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు..

ప్రైవేట్ హాస్పిటల్ లో ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూ పరీక్షలు విచ్చలవిడిగా చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్స్ లో పైథాలజిస్ట్ డాక్టర్లు లేకపోయినా రిపోర్టులు జారీ చేస్తున్నారు. డెంగ్యూ పరీక్షలు ఎలీషా ద్వారా చేసి నిర్ధారణ చేయాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నా ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ఆ నిబంధనలను తుంగలో తొక్కి ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా చేసిన పరీక్షలు కరెక్ట్ కావని వైద్యులే బహిరంగంగా చెబుతున్నారు. రోగి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఎలీషా ద్వారా పరీక్షలు చేసి నిర్ధారణ చేయాలి. ర్యాపిడ్ కిట్ల ద్వారా రెండు మూడు నిమిషాల్లో నిర్ధారణ చేసి ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ ద్వారా డెంగ్యూ పాజిటివ్ అంటూ రిపోర్టులు ఇస్తున్నారు. ఎలీషా ద్వారా సుమారు 45 నిమిషాల నుండి గంటపాటు తర్వాతనే నిర్ధారణ అవుతుందని క్వాలిఫై డాక్టర్లు చెబుతున్నారు.

ఎలిషా ద్వారానే డెంగ్యూ, ప్లేట్ లెట్స్ కౌంట్ నిర్ధారించవచ్చని పైథాలజిస్ట్ డాక్టర్లు చెబుతున్నారు. ర్యాపిడ్ కిట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్ లో ఉండకూడదని నిబంధన ఉన్నా కూడా ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లు మాత్రం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగి ఉంటే రోగి శాంపిల్ ను ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ కి పంపించి నిర్ధారణ అయిన తర్వాత రోగికి చికిత్సను అందించాలి, కానీ ఇక్కడ మాత్రం ఏ జ్వరం వచ్చిన డెంగ్యూ లక్షణాలు ఉన్నాయంటూ చికిత్సలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రవేట్ ఆస్పత్రులు డెంగ్యూ లక్షణాలు ఉన్న రోగి శాంపిలను పంపడం లేదని తెలుస్తోంది. రెండు మూడు కేసులు ఉంటే ఒకటే కేసును చూపిస్తూ మిగతా కేసులను గోప్యంగా ఉంచుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డెంగ్యూ భారీ పడిన రోగుల నుంచి లక్షలు రూపాయలు వసూలు చేస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎలీషా ద్వారా పరీక్షలు చేసి నిర్ధారణ చేయాలి : వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు

ఖమ్మం జిల్లాలో జ్వరాల సీజన్ ఎక్కువగా ఉందని, ప్రతి జ్వరం డెంగ్యూ కాదు. డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ ఎలిసా ద్వారా చేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్‌కు ఆదేశాలు జారీ చేశాం. ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం. డెంగ్యూ పేరు చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ వారు అధిక వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. డెంగ్యూ రోగి శాంపిల్ ఖచ్చితంగా ప్రభుత్వాస్పత్రి ల్యాబ్‌కు పంపించాలి.


Similar News