తప్పు సరిదిద్దడం శిక్షార్హమా..! పిల్లలను శిక్షించడం ఉపాధ్యాయుల తప్పా?

ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల నడవడిక గతానికి ఇప్పటికి చాలా మారింది.

Update: 2024-07-29 06:05 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల నడవడిక గతానికి ఇప్పటికి చాలా మారింది. విద్యా వ్యవస్థ లోపమా.. ఇది టీచర్లకు శాపమా.. తెలియదు కానీ.. విద్యార్థుల భవిష్యత్తు తెలియడానికి ముందే అనేక అవలక్షణాలు చుట్టుముడుతున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యాదేవోభవ అంటారు. తల్లిదండ్రి తర్వాత గురువు దేవునితో సమానం అంటారు. కానీ, ఈ రోజుల్లో ఆ ముగ్గురి దేవుళ్ల మాటలు వినడం దేవుడెరుగు.. ఎదురుతిరిగి మాట్లాడటం కామన్‌గా మారింది. తల్లిదండ్రులు భరిస్తునే ఉన్నారు.. టీచర్లు మార్చాలని చూస్తున్నారు. ఈ మార్పులో భాగంగా నయానో, భయానో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాలు టీచర్ల ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి.

దండించే అర్హత లేనట్టేనా..

పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులు ఆశిస్తారు. కానీ ప్రాథమిక విద్యాభ్యాసంలోనే అనేక అవలక్షణాలు దరిచేరడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాఠాలు చెప్పడానికే అయితే ఉద్యోగాలు ఎందుకు? అంటూ విమర్శిస్తున్నారు. దండించే అర్హత ఉంటేనే ఏ విద్యార్థి అయినా సక్రమ మార్గంలో నడుస్తాడని, ఉపాధ్యాయులకు ఆ అర్హత లేకుంటే వ్యర్థమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు మండలంలో జరిగిన ఘటన విషయంలో టీచర్ పై సస్పెన్షన్ వేటు వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా టీచర్లందరూ డీమోరలైజ్ అవుతున్నారు. ఇప్పుడు ఉన్నతస్థానంలో ఉన్న విద్యాశాఖ అధికారుల నుంచి కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది వరకు అందరూ వారు చదువుకున్న పాఠశాలలో టీచర్ల చేతిలో దెబ్బలు తిన్నారా.. లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మంచి పని చేస్తున్నా.. చెడు ఆపాదించడం వల్ల సమాజానికి నష్టమే తప్ప.. లాభం కాదన్నది గ్రహించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తగిన చొరవ చూపి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరుకుంటున్నారు.

తాజాగా జరిగింది ఇదే..

కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు జుట్టు బాగా పెంచుకున్నారు. వారికి పాఠాలు బోధించే ఓ టీచరమ్మ కొద్దిరోజులుగా జుట్టు కత్తిరించుకుని స్కూల్‌కు రావాల్సిందిగా కోరింది. ఆ మాటలను పెడచెవిన పెట్టిన విద్యార్థులు ఎన్ని రోజులైనా అదే పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. టీచర్ చెప్పిన మాటాలు పెడచెవిన పెట్టి ఇలాగే వస్తాం అయితే ఏంటి.. అనే ధోరణిలోకి మారిపోయారు. దీంతో చిర్రెత్తిన టీచర్ చెబితే వినేలా లేరని, స్వయంగా తానే ఓ కత్తెర తీసుకువచ్చి నెత్తిన అక్కడక్కడా కత్తిరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తమకు జరిగిన విషయాన్ని చెప్పి.. పాఠశాల మీదకు దండయాత్రకు వచ్చారు. పిల్లలకు మంచి పద్ధతులు చెప్పాలనే ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని, తల్లిదండ్రులే వెనుకేసుకురావడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యక్తం చేసిన ఆవేదనలో నిజం ఉంది. కానీ, విద్యాశాఖ అధికారులు మాత్రం ఆమె చేసిన పనిని తప్పుగా భావించి సస్పెన్షన్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. సస్పెన్షన్ వ్యవహారంపై విద్యావేత్తలు, టీచర్ యూనియన్ల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

ఓ హెచ్ఎం ఆవేదన..

క్లాసు జరుగుతున్నప్పుడు మీ పిల్లలు పాఠాలు వినకుండా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను. ఎలాంటి ప్రయోజనము లేదు. రాగి జావ తాగడానికి త్వరగా రారు. వచ్చినా త్వరగా తాగరు. భోజనానికి త్వరగా రారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బాగా అబద్ధాలు ఆడతారు. ఇప్పటికిప్పుడు పరీక్షలు పెడితే అసలు ఒక్కరు కూడా పాస్ కారు. ఈ పరిస్థితి ఎందుకో నాకు అర్థం కావడం లేదు. కొందరు పాఠాలు వినరు కొందరు విననివ్వరు. తల్లిదండ్రులుగా మీ బాధ్యతను మీరు నిర్వహించండి. మీ పిల్లలను మీరు మందలించండి. త్వరగా బస్సుగాని, ఆటోగాని ఎక్కి రావడానికి ఇష్టపడటం లేదు. మీరు డబ్బులు ఇవ్వరో ఏమో తెలియదు. ప్రతి రోజు మేము రోడ్డుపైకి వచ్చి ఎక్కించినా ఎక్కకుండా నడుస్తున్నారు. లేదా లిప్టు అడుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆడపిల్లలు కూడా ఏం తక్కువ లేరు. మీ సహకారం లేకుండా మేము ఏమీ సాధించలేం.

టీచర్ సస్పెన్షన్ పై ఖండన..

పేరువంచ ఇంగ్లీష్ టీచర్ డి.శిరీష.. విద్యార్థులు బాగా పెరిగిన జుట్టుతో పాఠశాలకు హాజరవుతున్నారని చెప్పినా జుట్టు కత్తిరించుకోవడంతో, వారిని సంస్కరించాలని ఉద్దేశంతో, జుట్టు కత్తిరించే ప్రయత్నం చేశారు. కానీ సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం సరైంది కాదు. ఇటువంటి చర్య పిల్లల క్రమశిక్షణ, బాగును కోరుకునే ఉపాధ్యాయుల మనోస్ఠైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు, క్రమశిక్షణ లేని విద్యార్థులకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. శిరీష 23 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో అనేక సేవలు అందించారు. డీఆర్పి గా విశిష్ట సేవలందించి విద్యారంగానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎనలేని కృషి చేసారు. డీఈఓ ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయకుండానే, ఎవరూ పిర్యాదు చేయకుండానే ఇలాంటి చర్య తీసుకోవడంను కల్లూరు మండల టీఎస్ యుటిఎఫ్ కమిటీ ఖండిస్తున్నది. ఏదైనా పొరపాటు జరిగితే ముందుగా షోకాజ్ నోటీస్ ఇచ్చి తర్వాత విచారణ చేసి సదరు ఉపాధ్యాయరాలు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందకపోతే చర్య తీసుకోవాలి. ఎటువంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం పట్ల ఉపాధ్యాయులు ఆగ్రహంతో ఉన్నారు. వారి సస్పెన్షన్ను ఎత్తివేసి రీ ఇన్స్టిట్యూట్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ కల్లూరు మండల కమిటీ కోరుతున్నది.

ఇంటెన్షన్ మంచిదే.. పద్ధతే సరైంది కాదు: సోమశేఖర శర్మ, డీఈవో

కల్లూరు మండలం పేరువంచ పాఠశాలలో జరిగిన ఘటన విషయంలో టీచర్ ఇంటెన్షన్ మంచిదే కావచ్చు. కానీ ఆమె ఆచరించిన పద్ధతి బాగా లేదు. విద్యార్థులు వినకపోతే వారి తల్లిదండ్రులను పిలిపించి వారిముందే మందలించి చెబితే బాగుండేది. లేదా హెచ్ఎంకు సమాచారం ఇస్తే తానే చర్యలు తీసుకునేవాడు. విద్యార్థులకు నచ్చని యాక్టివిటీ కారణంగా వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వార్త ఒక్కసారిగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులనుంచి ఒత్తిడి వల్ల సస్పెన్షన్ చేయాల్సివచ్చింది.

Tags:    

Similar News