కార్పొరేటర్ కర్నాటి కృష్ణ అరెస్ట్

జీవో నెంబర్ 59 గత బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాలిట శాపంగా మారింది. అధికారం అడ్డుపెట్టుకున్న కొంతమంది నాయకులు ఆనాటి అధికారుల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2024-06-18 14:58 GMT

దిశ, ఖమ్మం సిటీ : జీవో నెంబర్ 59 గత బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాలిట శాపంగా మారింది. అధికారం అడ్డుపెట్టుకున్న కొంతమంది నాయకులు ఆనాటి అధికారుల సహకారంతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఖమ్మం నగరంలో ఆక్రమిత స్థలాలపై మంత్రుల ఆదేశాలతో అధికారులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కొక్కటిగా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలు బయటకు వస్తూ వాటిని కాజేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

    దీనిలో భాగంగానే 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ లకారం పార్క్ సమీపంలో ఉన్న 500 గజాల స్థలాన్ని జీవో నెంబర్ 59 ద్వారా దానిని కాజేసేందుకు ప్రయత్నించినట్లు అధికారుల విచారణలో తేలడంతో అతనిపై అర్బన్ తహసీల్దార్ సిహెచ్ స్వామి ఫిర్యాదు పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ భాను ప్రకాష్ ను వివరణ కోరగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. లకారం పక్కన ఉన్న 500 గజాల భూమిని జీవో నెంబర్ 59 లో దానిని అక్రమంగా పొందటం కోసం ప్రయత్నించండంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అర్భన్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగిందని సీఐ తెలిపారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతనితో సహా మరో ఇద్దరిని కూడా రిమాండ్ చేసినట్లు సమాచారం. కలెక్టర్ మారగానే నగరంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమితదారులపై చర్యలకు పూనుకున్న అధికారులు వారిని జైలు ఊచలు లెక్క పెట్టిస్తున్నారు.

కర్నాటి కృష్ణ అరెస్ట్ ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు..

ఖమ్మం నగర 41వ డివిజన్ కార్పొరేటర్ ను మంగళవారం ఉదయం 5 గంటలకు ఖానాపురం హవేలీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్​ఎస్​ నేతలు అన్నారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పైన అక్రమంగా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నట్లు పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడల నాగరాజు తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన

    కర్నాటి కృష్ణ ను వెంటనే విడుదల చేయాలని పార్టీ నాయకులు , పార్టీ లీగల్ సెల్ నాయకులు స్టేషన్ బయట నిరసన తెలిపారు. కర్నాటి కృష్ణ ను విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం వారు ఖమ్మం ఏసీపీ రమణమూర్తిని కలిసి కర్నాటి కృష్ణను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. 


Similar News