తెలంగాణ రైతు గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ
రైతుబంధు పథకం దండగన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు బంధు ఇవ్వొద్దు అని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం తెలంగాణ రైతుల గొంతు నొక్కే కార్యక్రమం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదనరావు అన్నారు.
దిశ, ఖమ్మం : రైతుబంధు పథకం దండగన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతు బంధు ఇవ్వొద్దు అని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం తెలంగాణ రైతుల గొంతు నొక్కే కార్యక్రమం అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే తాతా మధుసూదనరావు అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు... ఒకడేమో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దు... 3 గంటల కరెంట్ చాలు అని, ఇంకొకడేమో వ్యవసాయం దండగ అంటున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పై కాంగ్రెస్ నాయకుల ప్రేమ ఇలా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి వాళ్లని నమ్మితే రైతులను నట్టేట ముంచుతారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యవసాయానికి పండుగ లా చేసేందుకు రైతు బంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు కరెంటు సరఫరా లేక.. పెట్టుబడికి సహాయం లేక చాలామంది వలసలు పోయేవారు అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత చాలామంది వలసలు పోయినవారు గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర కల్పించి రైతులను రారాజు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రైతులకు బీమా లాంటి సౌకర్యాలు కల్పించి రైతులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ మాత్రం నాలుగున్నర కోట్ల ప్రజలకు అండగా ఉంటారన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీఈసబీ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, ఉప్పల వెంకటరమణ, చింత నిప్పు కృష్ణ చైతన్య, తాళ్లూరు జీవన్, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.