పిల్లల కోసం కామన్ డైట్ కార్యక్రమం

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-12-14 11:13 GMT

దిశ, తిరుమలాయపాలెం : పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మంత్రి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి తిరుమలాయపాలెం మండలంలోని మహ్మదాపురం గిరిజన గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, అధికారులు బ్యాండ్ వాయిస్తూ, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. కామన్ డైట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదోని పిల్లలు కూడా ధనికుల పిల్లల్లా చదవాలని, వారి కోరికలు తీరేలా ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిందన్నారు. ప్రభుత్వానికి అదనంగా సుమారు 500 కోట్ల భారం పడుతున్నప్పటికి, దీనిని భారంగా కాక బాధ్యతగా చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక, ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు.

    గడిచిన పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం పేదవారి పిల్లలను పట్టించుకోలేదని, ఇందిరమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు నలబై శాతం కాస్మొటిక్ చార్జీలు 250 శాతానికి పెంచామని అన్నారు. డైట్ చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు పెంచిందని తెలిపారు. అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు, బాలురు 7వ తరగతి వరకు 62 నుంచి 150 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురకు 62 నుంచి 200 రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల తో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తున్నట్లు, అన్ని సదుపాయాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

    52 నుంచి 54 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు ఈ సంవత్సరం బడ్జెట్ లోనే నిధులు కేటాయించుకున్నామని, త్వరలోనే నిర్మాణాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపుతో పాటు, కిచెన్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిందన్నారు. దశల వారిగా 3 నెలలు సిబ్బందికి కిచెన్, స్టోరేజ్ నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు మంత్రి, విద్యాలయం రికార్డులు, నిర్మాణంలో ఉన్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.

    రూ. 5 కోట్లతో జి ప్లస్ 3 గా నిర్మిస్తున్న పాఠశాల కాంప్లెక్, ప్రిన్సిపాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ రూమ్ ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతలో రాజీ లేకుండా, అగ్రిమెంట్ సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పాఠశాల కాంపౌండ్ నిర్మాణం పూర్తి చేయాలని, సుందరీకరణ, జనరేటర్, ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, సీఈ శంకర్, డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి, ఈఈ తానాజీ, తహసీల్దార్ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్, నాయకులు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేశ్ రెడ్డి,బెల్లం శ్రీనివాస్, కొప్పుల అశోక్, తాజా,మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News