సరిహద్దు గ్రామాల్లో కోడి పందాలు
తెలంగాణ సరిహద్దు ఆంధ్ర జూదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలకు తెరలేపారు.
దిశ, భద్రాచలం : తెలంగాణ సరిహద్దు ఆంధ్ర జూదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో జాతీయ రహదారి పక్కనే కోడి పందేలకు తెరలేపారు. ఆంధ్ర అల్లూరి సీతారామ రాజు జిల్లా నెల్లిపాక, చోడవరం గ్రామాలలో, బూర్గంపహాడ్ మండలం సరిహద్దు వేలేరు గ్రామంలో, దుమ్ముగూడెం మండలం శివారు మారాయుగూడెం ప్రాంతంలో కోడిపందాలు, పేకాట జోరుగా సాగుతోంది. పందాలు నిర్వహించే చోటే అక్రమ మద్యం షాపులు వెలిసి చుక్క... ముక్క అందిస్తుండటంతో తెలంగాణా గ్రామాలకు చెందిన వేలాది మంది కోడి పందేల బాట పట్టారు. జూదంలో లక్షలాది రూపాయలు పోగొట్టుకుండటంతో పండగ వేళ కుటుంబంలో కలహాలు ఏర్పడుతున్నాయి. మద్యం మత్తులో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 లక్షల వరకూ బెట్టింగ్ నడుస్తుందని పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. కోడి పందాల కోసం తెలంగాణ గ్రామాల ప్రజలు ఆంధ్ర బాట పట్టడంతో సరిహద్దు గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించడం లేదు. ఈ పందేలలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. పెద్ద పెద్ద టెంట్లు వేసి బహిరంగంగా నిర్వహిస్తున్న కోడి పందాలను పోలీసులు నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.