సింగరేణి పై కేంద్రం కుట్రలను ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలి..

చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2024-07-09 12:07 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : చట్టసభలో ఉన్న మందబలంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సింగరేణి గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టాలను తీసుకువస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటుకు దారాదత్తం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణలోని సింగరేణి సంస్థను దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. ఈ చర్యలను ప్రతిఘటన ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలని అన్నారు.

బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన మూడో రోజు రిలే నిరాహార దీక్షల సందర్భంగా శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర సమితి పక్షాన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, దశలవారీగా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి బొగ్గు బ్లాకులను కార్పొరేట్ సంస్థలకు, అదానీ, అంబానీ లాంటి కుబేరులకు కట్టబెట్టే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టుపెట్టిన కేంద్రం మరో అడుగు ముందుకు వేసి తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని లేకుండా చేసే చర్యలకు పూనుకుందన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులలు ప్రైవేటీకరిస్తే కోల్బెల్ట్ ప్రాంతాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తమై కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వేలం ప్రక్రియని కేంద్రం విరమించుకొని తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మాలపాటి శేషయ్య, జి వీరాస్వామి, వంగ వెంకట్, కిష్టాఫర్, కత్తెర్ల రాములు, సందెబోయిన శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, సురేందర్, పి.చంద్రయ్య, ఆరె రాజు, అంకం రాజయ్య, కె కుమార్ రావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News