బీఆర్ఎస్‌కు గడ్డు కాలం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ హస్తగతం

జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది.

Update: 2024-06-09 02:24 GMT

బీఆర్ఎస్ ప్రతిష్ట ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ మసకబారుతున్నది. ఏ ఒక్క అవకాశమూ కలిసిరాక నిస్తేజంగా మారుతోంది. ఒకప్పుడు జిల్లాను ఏకచత్రాధిపత్యంగా ఏలిన నాయకులు ప్రస్తుతం ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీలో ఎంతో భవిష్యత్ ఊహించుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ ఇప్పడు సతమతం అవుతున్నారు. ఆర్థికంగా అనేక ఒడిదొడుకులు నెట్టుకుంటూ వచ్చినా సరైన ప్రాధాన్యం దక్కలేదని, ఇప్ఫుడు పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దిశ, ఖమ్మం బ్యూరో: జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. జిల్లాకు చెందిన అగ్ర నాయకుల ఓటమితో పాటు.. ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్ మొత్తం డోలాయమానంలో మునిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఆర్ఎస్.. నిన్న పార్లమెంట్‌లోనూ అదే కొనసాగించి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా సిట్టింగ్ స్థానమైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడంతో పార్టీ పటిష్టతపై నీలినీడలు అలముకున్నాయి.

రోజురోజుకూ పటిష్టమవుతున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుని ధీమాగా ఉండేది. కానీ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు సార్లు అధికారం చేపట్టినా.. జిల్లాలో మాత్రం పార్టీని బలోపేతం చేయలేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇక్కడి నాయకత్వాన్ని నమ్మి అధిష్టానం అంతగా దృష్టి పెట్టలేదా? వర్గ విభేదాలను కావాలనే పెంచి పోషించిందా? అన్న విషయాన్ని వదిలిస్తే ఫలితంగా మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్కటంటే ఒక్కటే స్థానాన్ని ఇవ్వడం గమనార్హం. మూడోసారి ఏకంగా పదికి 8స్థానాలు కాంగ్రెస్ వశం కాగా.. మిత్ర పక్షమైన సీపీఐకి ఒకటి దక్కింది. మిగిలిన ఒకటి బీఆర్ఎస్‌కు దక్కినా.. ఆ అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో పది స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లినట్లయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం అదే సీన్ రిపీట్ అయింది. సిట్టింగ్ స్థానమైనా కాంగ్రెస్ వశమైంది. మొత్తంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బీటలు వారి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో బలోపేతానికి సన్నద్ధమైంది.

సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా..

నల్లగొండ‌, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగాం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడంతో ఆ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరపడం అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో నిలువగా.. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు. మొదటి ప్రాధాన్య ఓటుతో విజేత తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఫలితంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఎమ్మెల్సీనీ కోల్పోవడంతో సాధారణ ప్రజలే కాకుండా పట్టభద్రులు సైతం బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో విముఖతతో ఉన్నారన్న విషయం అర్థమవుతోంది.

స్థానిక సంస్థల్లో మరింత పెరుగనున్న కాంగ్రెస్ గ్రాఫ్..

రానున్న రోజున్న కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, లోక్ సభలో వచ్చిన ఓట్లశాతం కంటే రెట్టింపు స్థాయిలో బలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టనుంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు టాస్క్ అప్పజెప్పే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా గ్రామస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి వారినీ పార్టీలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకోనుంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదనే వాదన వస్తుంది.

వద్దిరాజు, తాత మధుపై భారం..

జిల్లానుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వద్దిరాజు రవిచంద్ర, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమధుపై పార్టీని గాడిలో పెట్టే బాధ్యత ఉన్నా.. పూర్వవైభవం వస్తుందా అన్న సందేహం తప్పడం లేదు. వీరిద్దరూ అటు అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రేణులను సమాయత్తం చేసి, నాయకుల మధ్య మనస్పర్థలను తొలగించి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు. ఎంపీ, ఎమ్మెల్సీలిద్దరూ ఎలాంటి అమరికలు లేకుండా పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డా.. మిగతా నాయకులు వీరి కాళ్లకు బంధాలు వేయకుండా ఉండలేరన్న చర్చ సాగుతుంది.


Similar News