ఉమ్మడి జిల్లాలో కనిపించని బీఆర్ఎస్ నాయకులు
ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో చూసినా గులాబీ నాయకులు సైలెంట్‌గా ఉంటున్నారు.
దిశ, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అస్త్ర సన్యాసం చేసినట్లు కనిపిస్తుంది. ఏ నియోజకవర్గంలో చూసినా గులాబీ నాయకులు సైలెంట్‌గా ఉంటున్నారు. అక్కడి మాజీలు ఏ మాత్రం అందుబాటులో ఉండటం లేదని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓడిన తర్వాత ఒక్క నాయకుడు కూడా క్యాడర్‌కు, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఇదే కంటిన్యూ అయితే బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఒకరిద్దరు మాజీలు అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వస్తున్నా తూతూమంత్రంగా మమ అనిపిస్తూ కారెక్కి వెళ్లిపోతున్నారని, గతానికి ఇప్పటికి మాజీల ప్రవర్తనలో చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
గుండుసున్నా కారణమా..?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కటే స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత 2018లో ఒక్క స్థానానికే పరిమితమైంది. మూడోసారి 2023లో జరిగిన ఎన్నికల్లోనూ తిరిగి ఒక్క సీటు దక్కడం.. ఆ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం తో ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఆధిపత్యం శూన్యం. అయితే 2014, 2018 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమని అధికార పార్టీలో చేరిపోయారు. కొందరు మాత్రం గెలిచిన పార్టీలో ఉండి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేశారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నా.. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరడం.. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు బీఆర్ఎస్‌లో చేరడంతో కాలం వారి ఆశలన్నీ అడియాశలు చేసింది. 2023లో అధికారం కాంగ్రెస్ వశమైంది. అయితే ఈ దఫా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ ఎమ్మెల్యేలుగా లేకపోవడంతో ‘గుండుసున్నా’ అంటూ గేలి చేయడంతో ఆ పార్టీ నాయకులు సైలెంట్ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో బీఆర్ఎస్‌కు బలమే లేదని తేల్చిన సీఎం రేవంత్..
కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు చెందిన హేమాహేమీలైన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండటంతో బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరిందని, జిల్లాలో బీఆర్ఎస్‌కు ఏమి ఉందంటే గాడిద గుడ్డు మాత్రమేనని వైరాలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా బీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా, అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ప్రజలు తనకు అండగా ఉంటే భవిష్యత్‌లో బీఆర్ఎస్‌ను బద్దలుగొట్టి, బొందపెట్టే బాధ్యతను తీసుకుంటానని వెల్లడించంతో అటు కాంగ్రెస్ శ్రేణులు మరింత జోష్‌లో ఉండగా.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండడం విశేషం.
48 గంటలు గడిచినా..
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ముగిసి రెండు రోజులైనా జిల్లాకు చెందిన నాయకులు ఎవరూ స్పందించలేదు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరిట కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులే.. రీడిజైన్ పేరిట సీతారామ గా మారిందని, కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఖర్చు తప్ప.. బీఆర్ఎస్ చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గణాంకాలతో సహా విడమర్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో వేసిన పునాదులను తామే అధికారంలోకి వచ్చాక తక్కువ ఖర్చుతో పూర్తిచేసుకున్నామని, గోదావరి జలాలను కృష్ణా జలాలకు పారించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. రీడిజైన్ పేరిట కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఉమ్మడి ఖమ్మం జిల్లాను పడావు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.
భట్టి విక్రమార్క లెక్కలతో చెప్పిందంతా వాస్తవమేనని, అందువల్లే బీఆర్ఎస్ నాయకులు కొందరు భుజాలు తడుముకుంటున్నారని ఆ పార్టీలోని కొందరు నాయకులే అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలోని ఒక్క నాయకుడు కూడా స్పందించలేక పోతున్నాడని శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ హవా కొనసాగడం ఖాయంగా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌కు కౌంటర్‌గా జిల్లాలోని బీఆర్ఎస్‌లోని జిల్లా ప్రధాన నాయకులు ఎవ్వరూ కూడా మాట్లాడకపోవడం, జిల్లా అధ్యక్షుడు మాత్రమే అడపాదడపా కౌంటర్ ఇవ్వడం మినహా మిగతా వారు నిస్సహాయులుగా ఉండటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో గోక్కోవడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.