ఖమ్మం హాట్ సీట్లపై జోరుగా బెట్టింగ్.. పందెం రాయుళ్ల దృష్టంతా ఆ రెండు నియోజకవర్గాలపైనే..!
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రేపు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హాట్ సీట్లయిన ఖమ్మం, పాలేరులో గెలుపెవరిది? మెజార్టీ ఎంత? గెలిచిన అభ్యర్థుల ప్లస్సులు ఏంటి? ఓడిన వారి మైనస్‌లు ఏంటి? అన్న విషయాలపై ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందినవారే కాకుండా, ఆంధ్రాకు చెందినవారు సైతం పందేలు కాస్తున్నారు. ఈ రెండు సీట్లపై జిల్లా ప్రజలే కాకుండా.. రాజకీయ పార్టీలు సైతం తీవ్ర ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.
దిశ బ్యూరో, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలోని పార్టీలు సహా సాధారణ ప్రజానీకంలో సైతం చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మంలో 10 సెగ్మెంట్లు ఉండగా, అందులో రెండు జనరల్ నియోజకవర్గాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు ఈ రెండు నియోజకవర్గాలపై గెలుపెవరిది అంటూ బెట్టింగులు సైతం జోరందుకున్నాయి.
ఆ నియోజకవర్గాలే ఖమ్మం, పాలేరు.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఖమ్మం బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా.. పాలేరులో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపోటములపై సీక్రెట్ బెట్టింగులు సైతం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొదటి నుంచి చర్చలో రెండు సెగ్మెంట్లు..
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు మొదటి నుంచి ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉన్నాయి. కారణం.. ఇక్కడ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ అధికార పార్టీనుంచి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార బీఆర్ఎస్ పార్టీనుంచి విభేదించి ఎన్నో మలుపుల అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం బరిలోకి దిగారు. ఇక పాలేరులో కాంగ్రెస్ తరఫున పొంగులేటి పోటీ చేయడమే.. మొదట్లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం బరిలో పొంగులేటి, పాలేరు బరిలో తుమ్మల అనుకున్నప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణల వల్ల వారి సెగ్మెంట్లు మారాయి. అయినా ఆ రెండు స్థానాలు రెండు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ రెండు సెగ్మెంట్లు మొదటి నుంచీ చర్చల్లో నిలిచాయి.
లక్షల్లో బెట్టింగులు..
ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు జోరందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు.. ముఖ్యంగా యువత ఈ రెండు సెగ్మెంట్లలో లక్షల్లో బెట్టింగులు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బెట్టింగులు కాయగా.. పోలింగ్ సరళిని గమనించి మరికొన్ని చోట్ల పందెం కాసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోనే కాకుండా, రాష్ట్రంలోని పలుచోట్ల కూడా బెట్టింగ్ జరుగుతున్నల్లు సమాచారం. అంతేకాకుండా.. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో కూడా ఈ రెండు నియోజకవర్గాలపై బెట్టింగులు లక్షలు కాస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. గ్రౌండ్ లెవల్లో ఎవరికి అనుకూలమో.. అనేక విధాలుగా సమాచారాన్ని సేకరించి ఓ అంచానకు వచ్చారని.. అయితే పార్టీల కంటే కూడా అభ్యర్థుల క్రేజ్ పైనే బెట్టింగులు కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది..
అంచనా వేసేందుకు..
ఈ రెండు చోట్ల బెట్టింగుల దందా ప్రాసెస్ రెండు పార్టీల అభ్యర్థుల టికెట్ల కేటాయింపు జరిపినప్పటినుంచే ఉన్నట్లు సమాచారం. ఈ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులు ఉండడం.. వారిని ఓడించేందుకు ఆయా పార్టీలో ఎప్పుడూ లేని ఎఫర్ట్ పెట్టడం వల్ల బెట్టింగ్ రాయుళ్లు ముందే ఈ రెండు చోట్ల దృష్టిసారించారు. ఓ పైపు ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు వీరు సమాచారణ సేకరణతో పాటు.. ఎవరికి ఓటింగ్ అనుకూలంగా ఉండబోతుందోననే అంచనా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కొందరైతే ఏకంగా మనుషుల్ని పెట్టి బెట్టింగుల కోసం ఎవరు గెలుస్తారో సర్వే సైతం చేపించినట్లు తెలుస్తోంది. ఇక ఎవరు గెలుస్తారని కొంతమంది బెట్టింగ్ కాస్తుంటే.. మరికొంతమందేమో.. వారికొచ్చే మెజార్టీపై కూడా లక్షల్లో పందెం కాస్తున్నట్లు ఓ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు చెప్పడం గమనార్హం..