అన్నపురెడ్డిపల్లి మండలంలో అడ్డగోలుగా బెల్ట్‌‌షాపులు

అన్నపురెడ్డిపల్లి మండలంలో బెల్ట్‌షాపుల వారి ఆగడాలు మితి మీరుతున్నాయి. మండలం లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక్కడ రోజుకు వేలకు వేలు అమ్మకాలు జరుగుతున్నాయి.

Update: 2024-09-17 02:09 GMT

దిశ, అన్నపురెడ్డిపల్లి : అన్నపురెడ్డిపల్లి మండలంలో బెల్ట్‌షాపుల వారి ఆగడాలు మితి మీరుతున్నాయి. మండలం లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక్కడ రోజుకు వేలకు వేలు అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మందుబాబులకు మద్యం అరువుగా ఇస్తూ.. బాకాయి ఇవ్వకపోతే వస్తువులు లాక్కోవడం, బెదిరింపులకు గురిచేస్తూ వస్తువులు, భూములు కుదవ పెట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. అధిక ధరలతో మద్యం అమ్ముతుండటంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపులకు ఆటోల్లో మద్యం సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. మండలంలో 150 పైగా బెల్టు షాపులు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.

మండల పరిధిలో 15 గ్రామాలు ఉండగా పలు గ్రామాలు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో సిట్టింగులు ఏర్పాటు చేస్తూ.. తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతున్నారు. ఇండ్ల మధ్య, ప్రధాన రహదారి పక్కన సిట్టింగులు ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఒక్కొక్కటిగా తీసుకువచ్చి ఇస్తున్నారు. పలు గ్రామాల్లో కిరాణా దుకాణంలో నిత్యావసర సరుకులు అమ్ముతూ.. ఆ ముసుగులో మద్యం అమ్ముతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యం లభించడంతో వినియోగదారులు జేబులు ఖాళీ చేసుకుని, అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసై చెడు అలవాట్లకు వ్యసనం అవుతున్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా సాగుతున్నా.. ప్రధాన రహదారి వెంబడి బెల్ట్‌షాపులు.. సిట్టింగులు ఏర్పాటు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.


Similar News