దిశ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో ఉన్న ఎస్ బి ఐ బ్యాంక్ సిరిపురం శాఖలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ యత్నానికి ప్రయత్నించారు. బ్యాంకు ఉద్యోగులు గురువారం విధులు ముగించుకుని వెళ్లారు. బ్యాంక్ సిబ్బంది శుక్రవారం ఉదయం విధులకు రావడంతో.. బ్యాంకు ముందు భాగంలో డ్రిల్స్ ,షెట్టర్ తాళాలు ఓపెన్ చేయగా, బ్యాంక్ వెనుక భాగంలో ఉన్న డ్రిల్స్ సెంటర్ ఓపెన్ చేసి ఉండడాన్ని గమనించారు.
వెంటనే బ్యాంక్ అధికారులు పట్టణ పోలీసు స్టేషన్ కు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ ఎన్. సంధ్య హుటాహుటిన బ్యాంక్ కు చేరుకొని బ్యాంక్ పరిసరాలను పరిశీలించారు. బ్యాంక్ వెనుక భాగంలో ఉన్న డ్రిల్స్ , తాళం పగులగొట్టి బ్యాంక్ లోపలకి చొరబడి , బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.
చోరీ యత్నం సమయంలో అలారం మోగడంతో దొంగలు పారిపోయి ఉండవచ్చునని అన్నారు. వైరా ఏసిపి రెహమాన్ పట్టణ ఎస్సై ఎన్. సంధ్య , సిబ్బంది తో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బ్యాంక్ పరిసరాలను పరిశీలించి , పరిసరాలను గాలించారు. స్థానిక ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ ఉమేష్ కుమార్ యాదవ్ బ్యాంక్ లో ఎటువంటి నగదు , ఆభరణాలు చోరికి గురి అయినట్లు గుర్తించలేదని అన్నారు.
వినియోగదారుల ఇబ్బందులు:
బ్యాంకు కార్యకలాపాలు ఆగిపోవడంతో.. వినియోగదారులు ఇబ్బందులకు గురి అయ్యారు. ఒకవేళ బ్యాంకులో చోరీ జరిగి ఉంటే ఖాతాదారుల పరిస్థితి ఏమిటి ? లాకర్స్ ఓపెన్ చేసి, వాటిలో ఉన్న విలువైన పత్రాలు, ఆభరణాలు చోరికి గురి అయితే బ్యాంక్ ఏ విధంగా ఖాతాదారులకు చెల్లిస్తుంది? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.