నేనే రాజు.. నేనే మంత్రి! అధికారులకు టార్చర్ చూపిస్తున్న ఖమ్మం కలెక్టర్
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు తీవ్ర అసహనం కలిగిస్తున్నది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు తీవ్ర అసహనం కలిగిస్తున్నది. నాలుగేళ్లుగా జిల్లాలో పనిచేస్తున్న ఆ అధికారి తన మాటే శాసనమని, అందరూ వినాల్సిందేనని హుకూం జారీ చేస్తున్న తీరు వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈయన ధాటికి కొందరు బదిలీపై వెళ్తుండగా.. మరికొందరు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం మారినా ఈ అధికారి తీరు మారడం లేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం బదిలీ చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కూడా చేరింది. - దిశ తెలంగాణ బ్యూరో
రివ్యూ అంటేనే జంకు..
సమీక్షా సమావేశం జరుగుతుందంటే చాలు.. ఉద్యోగులు భయపడిపోతున్నారు. కలెక్టర్ ఎవరిని, ఎక్కడ ఏం అంటారో తెలియక జంకుతున్నారు. చెప్పింది వినడమే తప్ప.. ఎదురు మాట్లాడటం, తెలియని విషయాలు చెప్పాలంటే ఉద్యోగులకు సంకటంగా మారింది. యువకుడైన కలెక్టర్ సీనియర్ల విషయంలోనూ ఇలాంటి ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
ఉద్యోగిపై దుర్భాషలు..
కొద్దిరోజుల క్రితం వేంసూరుకు చెందిన ఓ ఉద్యోగి షుగర్ పరీక్షల కోసం సత్తుపల్లి వస్తే అక్కడ ఏం చేస్తున్నామని, టెలీకాన్ఫరెన్స్‌లోనే దుర్భాషలాడటంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పలు శాఖల్లో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్‌ను ఇంప్లిమెంట్ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఇతర కార్యాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రుల్లో పరిశీలనకు వస్తున్నాడన్న సమాచారం అందితే చాలు.. హెచ్ఓడీ నుంచి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతల అండదండలతోనే..
బీఆర్ఎస్ అధికారంలో ప్రజాప్రతినిధుల అండదండలతో కలెక్టర్ గౌతమ్ ఆడిందే ఆటగా సాగిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూములు ఇతరులకు ధారాదత్తం అయ్యాయన్న టాక్ ఉంది. చెప్పింది చేయడంతో కలెక్టర్ లీడర్లకు చాలా దగ్గరయ్యాడని, ఈ క్రమంలో ఉద్యోగులను చిన్నచూపు చూశారనే చర్చ సాగుతోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకే కలెక్టర్‌ను బదిలీ చేయడం లేదని, ఆ సంగతి తేలాకే కలెక్టర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది.
బదిలీ చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు..
మరోవైపు కలెక్టర్ వీపీ గౌతమ్‌ను బదిలీ చేయాలంటూ ఫిబ్రవరిలోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిగా ఉన్న గౌతమ్ గత నాలుగేండ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారని, దీంతోపాటు ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలున్న నేపథ్యంలో తక్షణమే బదిలీ చేయాలని ఫిర్యాదులో లేఖలో పేర్కొన్నారు.