తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. నడ్డా నివాసంలో కీలక భేటీ
తెలంగాణ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం మరింత దృష్టి సారించింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం మరింత దృష్టి సారించింది. అందులో భాగంగా కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. తెలంగాణ ఎన్నికలపై కిషన్ రెడ్డితో అధిష్టానం వరుసగా చర్చలు జరుపుతోంది. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే విషయంతో పాటు అభ్యర్థుల ఖరారుపై చర్చిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోండగా.. త్వరలోనే ప్రకటించేందుకు రెడీ అవుతోంది.
ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలపై చర్చించేందుకు ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరిగింది.గురువారం జరిగిన ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జావడేకర్‌తో పాటు లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. పొత్తులపై కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ రెడీ అయింది. ఇప్పటికే పవన్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. పవన్ రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. దీంతో పవన్ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.