ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రాష్ట్రానికి ప్రభాకర్ రావు?
అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నెల 10 తర్వాత ఆయనను ఇంటర్ పోల్ సాయంతో హైదరాబాద్‌కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు సైతం సంకేతాలు అందినట్టు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసి, విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు.
విజయోత్సవాల తరువాత మరింత స్పీడ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నది. ఆ సెలబ్రేషన్స్ ఈ నెల 9న ముగియనున్నాయి. వేడుకల సమయంలో ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించడం వల్ల ఉత్సవాల మూడ్ పోతుందని భావించిన ప్రభుత్వం.. ఈ నెల 10 తర్వాత ఆయన్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ పూర్తిగా సహకరిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాత్ర గురించి పోలీసుల విచారణలో అందిన వివరాలను కేంద్ర హోంశాఖకు పంపాం. వాటిపై ఆ శాఖ సంతృప్తి చెందింది. వెంటనే విదేశాంగ శాఖకు సమాచారం వెళ్లింది. ఇప్పటికే అమెరికాలోఉన్న భారత దౌత్యవేత్తను అలర్ట్ చేసినట్టు తెలిసింది’ అని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఈ నెల 10 తర్వాత ఇంటర్ పోల్ పోలీసులు రంగంలోకి దిగి, ప్రభాకర్ రావును దేశానికి తీసుకొస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రభాకర్ రావుకు అమెరికాలో చుక్కెదురు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్ గవర్నమెంట్ దూకుడును గమనించిన ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఆయనకు అక్కడి ప్రభుత్వం సహకరించదని, ఇంటర్ పోల్ పోలీసులకు అప్పగిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్ పోల్‌లో మన దేశం నుంచి సీబీఐకు సభ్యత్వం ఉన్నది. ఈ కేసులో ఎప్పటికప్పుడు సీబీఐలోని ఇంటర్ పోల్ వింగ్‌ను సీఎంఓ అధికారులు సంప్రదిస్తూ, ప్రత్యేకంగా ఫాలోఆఫ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తీసుకురావడం పెద్ద కష్టం కాదని, ఈ నెల 10 తర్వాత ఈ కేసులో చాలా డెవలప్‌మెంట్స్ జరుగుతాయనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్నది.
త్వరలో బీఆర్ఎస్ నేతల అరెస్టులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న బీఆర్ఎస్ లీడర్లను త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌లను పోలీసులు విచారించారు. ప్రభాకర్‌రావును అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత కీలక నేతల అరెస్టులు ఉంటాయని టాక్. మరోవైపు ఈ కేసులో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గులాబీ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అతన్ని పార్టీలో చేర్చుకుంటే కేసు ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని, అందుకే ఆయన జాయినింగ్‌ను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసును అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది.