నామినేటెడ్ ఎమ్మెల్సీలపై విచారణ.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పిటిషన్‌కు విచారణ అర్హత ఉన్నదో లేదో తొలుత తేల్చాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన తెలంగాణ హైకోర్టు జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పిటిషన్‌కు విచారణ అర్హత ఉన్నదో లేదో తొలుత తేల్చాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన తెలంగాణ హైకోర్టు జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇద్దరిని నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా ఆమోదం తెలపకుండా రిజెక్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వంలో నామినేటెడ్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను పరిశీలించి ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. కానీ ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రిజెక్టు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, తన పరిధికి మించి వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్న తీరులోనే హైకోర్టులో శుక్రవారం న్యాయవాది వాదనలను వినిపించారు.
అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు ఆ అధికారాలు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజే బెంచ్.. ఈ పిటిషన్ విచారణ అర్హతపై జనవరి 23న తేలుద్దామని తదుపరి హియరింగ్‌ను ఆ రోజుకు వాయిదా వేసింది.