ఫలించని KCR స్లోగన్.. అసదుద్దీన్‌కు మైనార్టీల షాక్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది.

Update: 2023-12-05 05:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. విజయానికి 60 స్థానాలు అవసరం కాగా సీపీఐ పొత్తు సీటుతో కలిపి 65 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ఇక, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఫలితాలపై సమీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. కాగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్‌కు ఈ సారి మైనార్టీలు షాక్ ఇచ్చారు.

బీఆర్ఎస్‌కే ఓటేయాలని చెప్పినా..

ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్, అక్బరుద్దీన్ మొదటి నుంచి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని ఈ సారి తాము పోటీ చేయని స్థానాల్లో మామూ(కేసీఆర్)కు మైనార్టీలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అయితే అనేక సెగ్మెంట్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే భావన కలగడం, ఎంఐఎం బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడంతో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. విజయాన్ని ప్రభావితం చేసే అనేక స్థానాల్లో కాంగ్రెస్‌కు వారంతా ఓటు వేశారు. కాంగ్రెస్‌కు మైనార్టీలు మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.

ఆ స్లోగన్ పని చేయలేదా..!

ముస్లిం ఓట్లే లక్ష్యంగా తెలంగాణలో ‘గంగా జమునా తెహజీబ్’ నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారు. ఈ సారి ఆ స్లోగన్ మ్యాజిక్ పని చేయలేదు. ఈ సారి కేసీఆర్ ప్రకటించిన మైనార్టీ బంధు రివర్స్ కావడం, మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, డబుల్ ఇళ్ల పంపిణీ విషయంలో జాప్యంతో ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అమలు చేస్తున్న పథకాలను సైతం మైనార్టీ నేతలనే అర్హులుగా ప్రకటించడంతో ఆ వర్గంలో అసంతృప్తి ఆకాశాన్ని అంటింది. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ సైతం ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసింది.

ఆ స్థానాల్లో పెరిగిన ఓట్లు..

ఇక, నాంపల్లి సెంగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 59,888 ఓట్లు సాధించింది. కేవలం 2,175 ఓట్లతో మహ్మద్ మాజిద్ హుస్సేన్ ఫిరోజ్ ఖాన్‌పై గెలుపొందారు. ఫిరోజ్ ఖాన్ మరింత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే ఈ సారి ఎంఐఎం సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయేది. ముస్లింల ఓట్లు అధికంగా ఉండే బోధన్‌లో కాంగ్రెస్ గెలుపొందగా, నిజామాబాద్ అర్బన్ ఎంఐఎం‌కు 18 కార్పొరేటర్లు ఉన్నా.. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ 59,853 ఓట్లు పొందారు. ఆదిలాబాద్‌లో సైతం ముస్లిం జనాభా అధికంగా ఉండగా ఇక్కడ సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి 46,763 ఓట్లు సాధించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లను తమ వైపునకు తిప్పుకోగలిగింది. మైనార్టీలు ఈ దఫా ఎంఐఎం చీఫ్ అక్బరుద్దీన్ మాటలను లైట్‌గా తీసుకున్నారు. ప్రతి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వైపే మైనార్టీ ఓట్లు మళ్లాయి.

ఎంఐఎం స్టాండ్‌పై ఉత్కంఠ..!

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పంచన చేరింది. కేసీఆర్ అన్ని అంశాల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వడం, వారికి టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కూడా ఓటు వేయొద్దని అసదుద్దీన్ చేసిన రిక్వెస్ట్ పనిచేయలేదు. రేవంత్ రెడ్డిపై ఎంఐఎం చీఫ్, అక్బరుద్దీన్ తీవ్ర స్థాయిలో మండిపడిన అదేం ఎఫెక్ట్ చూపలేకపోయింది. ఈ తాజా పరిణామాలతో ముస్లిం వర్గంలో అసదుద్దీన్ చరిష్మా తగ్గిందనే టాక్ నడుస్తోంది. మరి రానున్న కాలంలో ఎంఐఎం స్టాండ్ ఎలా ఉండబోతుంది.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ముందుకు సాగుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.

Read More: కాంగ్రెస్ వైపు ‘సిటీ’ BRS ఎమ్మెల్యేల చూపు.. త్వరలోనే చేరేందుకు ఓ నేత ప్లాన్..?


Similar News