KCR : కేసీఆర్ చేసింది దొంగ దీక్ష: గోనె ప్రకాష్ రావు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్(KCR) చేసిన దీక్ష దొంగ దీక్ష అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు(Gone Prakash Rao) విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్(KCR) చేసిన దీక్ష దొంగ దీక్ష అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్ రావు(Gone Prakash Rao) విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దీక్షా దీవస్ పేరుతో రెండు రోజుల నుంచి బీఆర్ఎస్ హడావుడి చేస్తోందని విమర్శించారు. వాస్తవానికి దీక్ష సమయంలో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారని, ఆయన దీక్ష మోసపూరితమన్నారు. ఉద్యమకారులను రెచ్చగొట్టి 1200 మంది ప్రాణాలు తీశారని, కేసీఆర్ దీక్ష దివాస్ పై కమిటీ వేసి దర్యాప్తు చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. కనీసం నిమ్స్ నుంచి కమిటీ వేసి విచారించాలని కోరారు.
చివరి వరకు పోరాటమని, 4లక్షల మంది చచ్చినా మా పోరాటం ఆగదని చెప్పి దొంగ దీక్షతో ప్రజలను రెచ్చగొట్టాడన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకలేదని, వారి చర్యలతో అమాయకులు బలయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో , తెలంగాణలో దీక్షా దీవస్ పేరుతో చావు నోట్లో కేసీఆర్ తలకాయ పెట్టినట్లుగా దొంగ దీక్షను ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ దీక్షపై విచారణ జరిపించాలని ఉత్తమ్ కు, జానారెడ్డికి, జైపాల్ రెడ్డికి గతంలో కూడా విన్నవించానని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత సైతం మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకమవుతారని ప్రకటించుకున్నారని, అమె తనకు జరిగిన అన్యాయంపైన మాట్లాడుతుందో లేక ప్రజల సమస్యలపై మాట్లాడుతుందోనని ఎద్దేవా చేశారు.