రంగంలోకి కేసీఆర్.. ఇవాళ లోక్‌సభ అభ్యర్థిత్వాల ఖరారుపై సమావేశం
పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గెలుపు గుర్రాలను లోక్‌సభ బరిలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గెలుపు గుర్రాలను లోక్‌సభ బరిలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం కరీంనగర్, పెద్దపెల్లి నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్ వేదికగా భేటీ కానున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు.
అనంతరం ఈ నెల 10న కరీంనగర్‌లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సభకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. బహిరంగ సభతో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, కాళేశ్వరంతో ఏర్పడుతున్న ఇబ్బందులపై తీసుకోవాల్సిన స్టాండ్‌పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తున్నది.