బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై KCR అనూహ్య నిర్ణయం.. 5 స్థానాలు వారికే..?!
ఈసారి పారిశ్రామికవేత్తలే ఎమ్మెల్సీ కానున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. వారితో సీఎం కేసీఆర్ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈసారి పారిశ్రామికవేత్తలే ఎమ్మెల్సీ కానున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. వారితో సీఎం కేసీఆర్ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. పారిశ్రామికవేత్తలతో ముందుగా మంత్రులు భేటీ అయిన తర్వాత నేరుగా అధినేతను కలిపిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే, నామినేటెడ్ కోటాలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎదురు చూస్తున్న సుమారు 50 మంది పార్టీ నాయకులకు నిరాశే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ, మరొకటి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మూడు, గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం మార్చి నెలలో, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన రాజేశ్వర్ రావు, ఎంఏ ఫారూఖ్ హుస్సేన్ పదవికాలం మే నెలలో ముగియనుంది.
ఇప్పటికే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం నుంచి మీర్జా రెహ్మత్ బేగ్ ఏకగ్రీవం కాగా, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో ఏర్పాటైన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిగిలిన 5 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీకి చెందినవి కావడంతో గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. గతంలో కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చిన సుమారు 50 మంది వరకు నేతలు ఆశలు పెట్టుకున్నారు.
పెట్టుబడిదారుల కోసం సెర్చ్
ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తల వైపు అధిష్టానం చూస్తోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారి వివరాలు సేకరిస్తోంది. ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వారిని నియమించాలని భావిస్తోంది. ఆ బాధ్యతను మంత్రులకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్రంలో పేరున్న పారిశ్రామికవేత్తలతో మంత్రులు మంతనాలు జరిపినట్లు సమాచారం.
అంతేకాదు.. వాళ్లతో ప్రగతిభవన్‌లో స్వయంగా కేసీఆర్ భేటీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారు పార్టీకి ఏమేరకు ఉపయోగపడతారనే వివరాలు సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలను రాజ్యసభ సభ్యులుగా నియమించింది. అదే తరహాలో పలువురు పారిశ్రామిక వేత్తలను ఎమ్మెల్సీలుగా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆశావాహులకు నిరాశే..?
ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎప్పుడైనా కేసీఆర్ కరుణించి నామినేటెడ్ పదవి ఇవ్వకపోతారా.. అని ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మందికి పైగా ఎదురు చూస్తున్నారు. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టికెట్ ఇవ్వలేకపోయిన నేతలకు మండలి లేదా రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మండలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
వారితో పాటు మునుగోడు ఉప ఎన్నికకు ముందు పార్టీలో చేరిన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. ఇలా చాలా మంది కేసీఆర్ కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఖాళీ అవుతున్న 5 స్థానాల కోసం పారిశ్రామికవేత్తలకు అవకాశం ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తుండటంతో వీరికి మళ్లీ నిరాశే మిగలనున్నట్లు సమాచారం. ఒక్కరికో, ఇద్దరికో చోటు దక్కే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read...