కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యా
దిశ, వెబ్‌డెస్క్: కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దేశంలో రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కావని, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మాట్లాడిన ఆయన,.. గతంలో అనేక రాజకీయ ఫ్రంట్లు వచ్చాయని, అవి ఏం సాధించాయని ప్రశ్నించారు. రాజకీయ పునరేకీకరణతో సాధించబోయేది ఏది లేదని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రత్యామ్నాయ సిద్దాంతానికి ప్రారంభం పడాలని, దానికి హైదరాబాద్ వేదిక కావాలని అన్నారు. హైదరాబాద్ వేదికగా దేశ స్థితిని, గతిని మార్చేలా కొత్త ఎజెండా రూపొందితే అది మనకే గర్వకారణమన్నారు. ఉన్నపాటున ప్రజలు తమ గుండెలపై చేయి వేసుకుని దేశ లక్ష్యం ఏంటో చెప్పుకునే పరిస్థితి లేదని అన్నారు. దేశ లక్ష్యం అంటే ఒక వ్యక్తి చెప్పే సిద్దాతమో, ఓ పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదని అన్నారు. దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందన్నారు.
దేశ ప్రజల సామూహిక లక్ష్యమే దేశ లక్ష్యం అయి ఉండాలని అన్నారు. ఒక గమ్యం దిశగా దేశం మొత్తం ప్రయాణం చేయాలని, అలా అన్ని దేశాలు చేస్తూ అభివృద్ధి దిశగా వెళ్తుంటే.. భారతదేశం మాత్రం తన గమ్యాన్ని మర్చిపోయిందన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చూస్తూ మౌనంగానే ఉండిపోదామా? అని ప్రశ్నించారు. 1980 వరకు భారత జీడీపీ కన్నా చైనా జీడీపీ తక్కువ అని, ఇప్పుడు అది ప్రపంచంలోనే సూపర్ పవర్ గా అవతరించిందన్నారు. ఉన్న వనరులను ఉపయోగించుకోవడం లేదని అన్నారు. మన రాష్ట్రంలో ఉండే ఓ జిల్లా అంత లేని ఇజ్రాయేల్ దేశం నుండి మనం ఆయుధాలు కొనుగోలు చేసుకునే స్థితిలోనే ఉన్నామని చెప్పారు. అద్భుతమైన అటవీ, ఖనిజ, జల సంపద ఉన్నప్పటికీ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.