లిక్కర్ కేసులో కవిత మేనల్లుడు.. తెరపైకి మేక శరణ్ పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంట గంటకు కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి.

Update: 2024-03-23 11:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గంట గంటకు కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్ ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ వైపు కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో మరోవైపు శరణ్ నివాసంలో ఈడీ రెయిడ్స్ నిర్వహించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది.

కలిపి విచారించేందుకు గ్రీన్ సిగ్నల్:

వారం రోజుల కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హజరుపరించింది. ఆమెను మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. విచారణకు కవిత సహకరించడం లేదని, కవిత కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. తాము కోరిన డాక్యుమెంట్లు కవిత ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారని ఆమె తరపున లాయర్ ప్రశ్నించారు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవితకు ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అలాగే కేజ్రీవాల్, సమీర్ మహేంద్రుతో పాటు మరికొంత మందితో కలిపి వన్ టు వన్ ఇంటరాగేషన్ చేసేందుకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ విచారణలో వెలువడబోయే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి.

Tags:    

Similar News