మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.
దిశ, చిగురుమామిడి : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని అంగన్వాడీ, ఫ్రీ ప్రైమరి స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. చిగురుమామిడిలో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన, నవాబుపేట, ముదిమాణిక్యం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో మాట్లాడారు.
మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెళ్లితో సంబంధం లేకుండా తర్వాత కూడా చదువుకోవాలన్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి హోటల్, ఫంక్షన్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పమేల సత్పతితో కలిసి గర్భిణులకు శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, తహసీల్దార్ ముద్ధసాని రమేష్, ఎంపీడీఓ బాసం మధుసూదన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్లు పన్యాల అనురాధ, గొల్లపల్లి ధనలక్ష్మి, బెజ్జంకి సంపూర్ణ, ఉల్లెంగుల ఇందిర పాల్గొన్నారు.
మంత్రిని నిలదీసిన మహిళా రైతు
మంత్రి పొన్నంకు మహిళా రైతు నుండి నిరసన సెగ తగిలింది. చిగురుమామిడి మండల కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన శుక్రవారం సభలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంతలో సభ మధ్యలో నుండి చిగురు మామిడి గ్రామానికి చెందిన బెజ్జంకి భాగ్యవ్వ అనే మహిళ రైతు మంత్రిని రైతు బంధు పథకంపై నిలదీసింది.
ప్రతి సంవత్సరం రైతులకు రైతుబంధు, రైతుబీమా వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇవన్నీ ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. కాగా మహిళ అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం సమాధానం చెబుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని బదులిచ్ఛారు. ఇదే విషయంపై సదరు మహిళను విలేకరులు వివరణ కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, ఇప్పటికి రుణమాఫీ ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. తనకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పారు.