KTR : విద్యార్థుల విషయంలో రాజకీయాలు చెయ్యం
విద్యార్థుల విషయాలలో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : విద్యార్థుల విషయాలలో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతూ పాము కాటుకు గురై, మరణించిన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ కుటుంబ సభ్యులని సోమవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల ఆలనా పాలనా చూసే వారే కరువయ్యారని, గత ఎనిమిది నెలల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని మండిపడ్డారు.
అంతేకాకుండా సుమారు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇతరత్రా కారణాలతో ఆసుపత్రుల పాలయ్యారన్నారు. 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వీలైతే కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మేల్కొని అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలని, తల్లిదండ్రుల్లాగా ఆరున్నర లక్షల విద్యార్థుల బాగోగుల బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను పర్యవేక్షించేలా, ఒకటి రెండు పాఠశాలలను దత్తత తీసుకునేలా ఆదేశాలు ఇచ్చి, కడుపు కోతలు పోయే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో అధ్యయన బృందం..
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గురుకులాల ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం ఉందని, ఆయన ఆధ్వర్యంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పాఠశాలలో పర్యవేక్షించి, నీక్షెప్తపాతంగా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అలాగే తయారు చేసిన నివేదికపై నిర్మాణాత్మకమైన తీర్మానాలు చేస్తామని సూచించారు.