Collector Sandeep Kumar Jha :ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు, అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి మొత్తం కలిపి 42,941 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ చేసే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ యాప్ డౌన్ లోడ్ చేసే విధానం, వివరాల నమోదుపై వివరించారు. దరఖాస్తుల స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించాలని, జిల్లాలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేయాలని సూచించారు. సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం, మున్సిపాలిటీలలో బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్ పక్కాగా నమోదు చేస్తారని, అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్, నాలా, చెరువులు, హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోవి కావని ధ్రువీకరించాలని అన్నారు. ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల విషయమై అందరి వద్ద సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు పాల్పడవద్దని అధికారులకు సూచించారు. కలెక్టరేట్, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్ లు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో డీటీసీపీఓ అన్సారీ, డీపీఓ వీర బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.