ఆసియన్ క్రిమినాలాజీకల్ సొసైటి సదస్సుకు సిరిసిల్ల న్యాయవాది ఎంపిక

15వ ఆసియన్ క్రిమినాలజికల్ సొసైటీ వార్షిక సదస్సుకు సిరిసిల్లకు

Update: 2024-08-03 08:45 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: 15వ ఆసియన్ క్రిమినాలజికల్ సొసైటీ వార్షిక సదస్సుకు సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది చెక్కిళ్ల మహేష్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈనెల 8 నుండి 10 వరకు ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మానిలాలో ఆసియన్ క్రిమినాలజికల్ సొసైటీ (ఏసిఎస్), ప్రొఫెషనల్ క్రిమినాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ది ఫిలిప్పిన్స్ (పిసిఏపి) ఆధ్వర్యంలో 15వ ఆసియన్ క్రిమినలజికల్ సొసైటీ వార్షిక సదస్సు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. క్రిమినాలజీ క్రిమినల్ జస్టిస్, టెక్నాలజీ అండ్ పబ్లిక్ సేఫ్టీ అనే అంశంపై జరగబోతున్న ఈ వార్షిక సదస్సుకు సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చెక్కిళ్ళ మహేష్ గౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఆహ్వానం అందింది.

41 దేశాల ప్రతినిధులు హాజరు

మహేష్ గౌడ్ "ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ది రూల్ ఆన్ ఎవిడెన్స్" అనే అంశంపై వ్రాసిన అబ్స్ట్రాక్ట్ ను వారి వార్షిక జర్నల్ లో ప్రచురణకు ఎంపిక చేయడంతో పాటుగా, అదే అంశం మీద ఆయనను సదస్సులో వ్యాఖ్యానించడానికి వారు ఆహ్వానించారు. ఈ సదస్సుకు ఆసియా వ్యాప్తంగా 41 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇటీవల భారత దేశంలో నూతన క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చిన క్రమంలో ఫోరెన్సిక్ సైన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో ఈ సదస్సు చాలా అంశాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని, 41 దేశాలనుండి పాల్గొనే ప్రతినిధుల ముందు ఒక మంచి అంశంపై ప్రసంగించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని న్యాయవాది మహేష్ గౌడ్ తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ అండ్ రూల్ అఫ్ ఎవిడెన్స్ అనే అబ్స్ట్రాక్ట్ ను ప్రిపేర్ చేయడానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చిన సీనియర్ న్యాయవాదులు యస్. వసంతం, జి. భాస్కర్ రెడ్డి, గోవింద్ భాస్కర్, గంత అంజయ్యలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మహేష్ గౌడ్ ఎంపిక పట్ల జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Similar News