సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి రక్షించాలి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి రక్షించి, కార్మికులకు, ఆసాములకు ఉపాధి కల్పించాలని మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి రక్షించి, కార్మికులకు, ఆసాములకు ఉపాధి కల్పించాలని మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్, ఆసాముల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నేతన్నలకు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌లతో ఆయన హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం నేటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కురుకు పోయిందన్నారు.
వస్త్ర పరిశ్రమ మూతపడడంతో ఉపాధి లేక పవర్లూమ్ కార్మికులు, ఆసాములు, అనుబంధ రంగాల కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించింది కానీ వాటికి సంబంధించిన బకాయిలను కార్మికుల యారన్ సబ్సిడీ బకాయిలను చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెస్కోకి చెల్లించాల్సిన రూ. 482 కోట్ల చెల్లించకపోవడం, దీనికి తోడు జనవరిలో ఇవ్వవలసిన బతుకమ్మ చీరల ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసిన వస్త్రాలు ఉత్పత్తి ఆర్డర్స్ ఇవ్వలేదన్నారు. దాంతో వస్త్ర పరిశ్రమ యాజమాన్యం పవర్ లూమ్స్ ని మూసివేసిన క్రమంలో ఉపాధి లేక కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు.
బాధ్యత కలిగిన ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని, గత ప్రభుత్వంలో పవర్లూమ్ కార్మికుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కొనసాగించిన పథకాలను అమలు చేయాలన్నారు. సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. పాలకులకు ప్రతిపక్షాలకు కార్మికుల ఓట్లుతో సీట్లు కావాలే తప్ప కార్మికుల కష్టాలు పట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న హక్కులను చట్టాలను కాలరాస్తుందన్నారు.
సిరిసిల్లలో కార్మికులకు నిరంతరం అండగా ఉంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించి విజయాలను సాధించిన చరిత్ర ఎర్రజెండాదని, రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల సంక్షోభ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల కావలసిన వస్త్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని, రాష్ట్రంలోని కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, ఆసాముల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవి, కార్యదర్శి చేరాల అశోక్, సహాయ కార్యదర్శి మండల రాజు, సీపీఎం జిల్లా నాయకులు జవ్వాజి విమల, సూరం పద్మ,సీఐటీయూ జిల్లా నాయకులు మోర అజయ్, అన్నదాస్ గణేష్, నక్క దేవదాస్, వార్పిన్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, యూనియన్ అధ్యక్షులు కుమ్మరి కుంట కిషన్, సీఐటీయూ జిల్లా నాయకులు నక్క దేవదాస్, కంది మల్లేశం పాల్గొన్నారు.