పోలింగ్ విధులపై సెక్టార్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి : కలెక్టర్
పోలింగ్ రోజు ప్రారంభం నుంచి పూర్తి అయ్యేవరకు చేపట్టాల్సిన పనులపై
దిశ, సిరిసిల్ల : పోలింగ్ రోజు ప్రారంభం నుంచి పూర్తి అయ్యేవరకు చేపట్టాల్సిన పనులపై సెక్టార్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సూచించారు. అప్పుడే సెక్టర్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులకు ఇతర ఎన్నికల సిబ్బందికి సరిగ్గా గైడ్ చేయగలుగుతారని చెప్పారు. గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో పోలింగ్ డే రోజు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పార్టీ నిర్వహించాల్సిన విధులపై సెక్టార్ అధికారులకు తహసిల్దారుకు, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డెమో ఓటింగ్ మిషన్ ల ద్వారా పోలింగ్ రోజు చేయాల్సిన విధులు, డాక్యుమెంటేషన్ పై జిల్లా కలెక్టర్, మాస్టర్ ట్రైనర్ లు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలింగ్ రోజు మాక్ పోలింగ్ అయిందో లేదో పరిశీలించడం, మాక్ పోలింగ్ లో నమోదైన ఓట్లను క్లియర్ చేయడం, పోలింగ్ ను ప్రారంభించడం, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటింగ్ శాతాన్ని తెలపడం, పోలింగ్ ప్రారంభానికి, ముందు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే తీసుకోవాల్సిన చర్యలు, పోలింగ్ పూర్తి అయిన ఈవిఎం లకు సీల్ వేయడం, సంబంధిత పత్రాలు పూరించడం తదితర అంశాలను జిల్లా కలెక్టర్ అధికారులకు కూలంకషంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఎన్నికల మార్గదర్శకాలు, పోలింగ్ విధుల పై ప్రతి అధికారికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఎన్నికల పోలింగ్ సజావుగా పూర్తయ్యేలా మానిటరింగ్ చేయగలుగుతారన్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సరైన రీతిలో పోలింగ్ అధికారులను గైడ్ చేస్తూ పరిష్కారం చూపుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీవో మధుసూదన్, శిక్షణ పర్యవేక్షకులు పిబీ శ్రీనివాస చారి, డిఆర్డిఓ నక్క శ్రీనివాస్, మాస్టర్ టైన్రర్లు, తదితరులు పాల్గొన్నారు.