సిరిసిల్లలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. అక్కడక్కడ మొరాయించిన ఈవీఎంలు

జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లా

Update: 2024-05-13 15:19 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు వరకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఉదయం మందకొడిగా జరిగిన పోలింగ్ సరళి మధ్యాహ్నం తరువాత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అయితే పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పలు చోట్ల మద్యంతో పాటు డబ్బుల పంపిణీ చేసినట్లు సమాచారం. పోలింగ్ కు ఒకటి, రెండు రోజులు ముందు నుండే ఓటర్లకు మద్యం పంపిణీ నిర్వహించగా ఆదివారం రాత్రి నుండి డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారని పలువురు అంటున్నారు.

సిరిసిల్ల పట్టణంలోని కొన్ని వార్డుల్లో యదేచ్చగా డబ్బు పంపిణీ రోడ్లపై, పోలింగ్ బూత్ ల సమీపంలో కొనసాగగా ఇతర వార్డుల్లో ప్రణాళికాబద్ధంగా గుట్టు చప్పుడు కాకుండా నాయకులు పంపిణీ చేశారు. మరోవైపు ఒక పార్టీ డబ్బులు పంపిణీని తెలుసుకున్న ఓటర్లు తమ ఓటును వెంటనే వేయకుండా ఇతర పార్టీల కోసం వేచి చూడడం చరిత్రలో మొదటిసారిగా ఇక్కడ చెబుతున్నారు. పట్టణంలో ఒక ప్రజా ప్రతినిధి ఇంటిలో మద్యం నిలువలు పట్టుకోవడానికి పోలీసులు వాటిని సీజ్ చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్, బిఆర్ఎస్ అభ్యర్థి సోమవారం మధ్యాహ్నం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రజలకు అభివాదాలు చేశారు. అయితే గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి మాత్రం ప్రశాంతంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధులు, వికలాంగులు సైతం తమ ఓటు హక్కును వినియోగించడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

నూతనంగా ఓటరుగా నమోదైన యువతి, యువకులు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. పార్టీల బాధ్యులు ఎవరికి వారు ఓటర్లను తమ వైపు నకు తిప్పుకునేందుకు పాట్లు పడ్డారు. ఇదిలా ఉండగా పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 1500 మంది అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. కేంద్ర బలగాలతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలింగ్ స్టేషన్లను తమ అదుపులో ఉంచుకున్నారు. జిల్లా వ్యాప్తంగా బందోబస్తు చర్యలు చేపడుతూ సిబ్బందికి తగిన ఆదేశాలిస్తూ చర్యలు చేపట్టారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు కీమ్యా నాయక్, పూజారి గౌతమి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్ లలో జరుగుతున్న పోలింగ్ తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా పరిశీలించారు. సాయంత్రం ఆరు గంటల వరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గంలో 75.33%, వేములవాడ నియోజకవర్గంలో 74.44% పోలింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.


Similar News