పౌరసరఫరాల శాఖ అధికారుల విఫలం.. రాష్ట్రం దాటుతున్న పీడీఎస్ బియ్యం

పేదలకందాల్సిన రేషన్ బియ్యం(PDS rice) అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. హుజూరాబాద్ సబ్ డివిజన్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగా నడుస్తుంది.

Update: 2024-10-11 02:10 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్: పేదలకందాల్సిన రేషన్ బియ్యం(PDS rice) అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. హుజూరాబాద్ సబ్ డివిజన్లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగా నడుస్తుంది. అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా రేషన్ మాఫియా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని సంస్కరణలు తెచ్చినా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండా పోతుంది. సరైన నిఘా లేకపోవడం, సంబంధిత అధికారులు రేషన్ డీలర్లు, దళారుల వద్ద మామూళ్లు దండుకొని చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ దందా దర్జాగా సాగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించడానికి ఏజెంట్లను నియమించుకొని పది రూపాయల కిలో చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రలోని సిరొంచా ప్రాంతానికి తరలించి 23 నుంచి 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి హుజూరాబాద్ సబ్ డివిజన్లో భారీగానే కేసులు నమోదయ్యాయి. పౌరసరఫర అధికారులు, రేషన్ డీలర్లు, దళారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వినవస్తున్నాయి.

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా..

హుజూరాబాద్ ప్రాంతం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం దందా సాగుతుంది. హుజూరాబాద్ పట్టణంతో పాటు మండలాల్లో దళారులు అనధికారికంగా బియ్యం స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు డీలర్లు లబ్ధిదారుల నుంచి బియ్యం తీసుకొని డబ్బులు చెల్లిస్తున్నారు. కొందరు దళారులు ఇంటింటికి తిరుగుతూ బియ్యం కొంటున్నారు. అనంతరం దళారులే స్టాక్ పాయింట్లకు చేర్చి లారీల్లో అర్ధరాత్రి వేళ మహారాష్ట్రలోని శిరంచ ప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా గత కొద్ది రోజుల నుంచి ముల్కనూరు లోని ఒక మిల్లుకు సైతం రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. మరికొందరు మిల్లర్లు కొనుగోలు చేసి వాటిని మరాడించి ఎఫ్సీఐకి లేవి పెడుతున్నారు. అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో బియ్యం లోడులు ఇక్కడి నుంచి బయలుదేరి పోతున్నాయి.

ఏకంగా స్టాక్ పాయింట్లను పెడుతున్నారు..

హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్, సూపర్ బజార్ ఏరియా, కింది వాడ ప్రాంతాలతో పాటు పోతిరెడ్డిపేట ,శాలపల్లి,చెల్పూర్, రాజపల్లి, కాట్రపల్లి, కనుకులగిద్దే, తదితర గ్రామాల్లో స్టాక్ పాయింట్లను పెడుతున్నారు.ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు స్థానిక మిల్లులకు బియ్యం సరఫరా చేస్తున్నారు.మిల్లర్లు రేషన్ బియ్యాన్ని డబుల్ పాలిష్ చేసి సన్నబియ్యం గా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. మరికొందరు ఎఫ్సీఐకి లేవీ పెడుతూ వారి సీఎంఆర్ నుంచి బయట పడుతున్నారు. ఆకర్షణీయంగా సంచుల్లో పెట్టి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. 25 కేజీల బస్తా బియ్యాన్ని 1300 నుంచి 1400 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు దళారులు మార్కెట్లో విక్రయించే వ్యాపారి కలిసి రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

మరికొందరు దళారులు నూకలుగా పట్టించి హన్మకొండ జిల్లా అన్న సాగరం ప్రాంతంలో ఉన్న పౌల్ట్రీ ఫారాలకు విక్రయిస్తున్నారు. వీరితో కుమ్మక్కై పౌరసరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి క్రాస్ రోడ్ వద్ద రేషన్ బియ్యం పట్టుకొని రేషన్ డీలర్ మన్నెమ్మ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పలు స్టేషన్లలో ప్రతినిత్యం కేసులు నమోదవుతున్నాయి. సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. హుజరాబాద్ సబ్ డివిజన్లోని రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని వారు కోరుతున్నారు.

దాడులు చేస్తున్నా ఆగని దందా..

హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు దాడులు చేస్తూ అక్రమ రేషన్ బియ్యాన్ని అడ్డుకుంటున్నప్పటికీ అక్రమ దందా ఆగడం లేదు.అధికారులు రేషన్ బియ్యం అక్రమ సరఫరా పై నిఘా పెడుతూ క్వింటాళ్ల కొద్దీ స్వాధీనం చేకుంటున్నారు. పట్టణంతోపాటు ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

చర్యలు తీసుకుంటున్నాం

పేదల కోసం ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. రేషన్ డీలర్లు, దళారులు మిల్లర్లకు విక్రయించడం నేరం. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేయడం కూడా నేరమే. కొనుగోలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేస్తున్నాం. తగిన చర్యలు తీసుకుంటాం.-డీఎస్ఓ నర్సింగరావు


Similar News