ప్రెస్ క్లబ్‌ల ఏర్పాటుకు సంఘాల అనుమతి అవసరం లేదు : తాడూరి కరుణాకర్

నూతన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుకు జర్నలిస్టు సంఘాల అనుమతి అవసరం

Update: 2025-03-27 07:16 GMT
ప్రెస్ క్లబ్‌ల ఏర్పాటుకు సంఘాల అనుమతి అవసరం లేదు :  తాడూరి కరుణాకర్
  • whatsapp icon

దిశ,మంథని : నూతన ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుకు జర్నలిస్టు సంఘాల అనుమతి అవసరం లేదని తెలంగాణ డబ్ల్యూ జేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ అన్నారు.బుధవారం ఆయన మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంథని పట్టణానికి చరిత్ర ఉందని, ఇలాంటి పట్టణంలో డివిజన్ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. డివిజన్ ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణ,ప్రారంభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న సమయంలో కొన్ని అవాంఛనీయ విషయాలు చూడాల్సి వచ్చిందని అన్నారు.జర్నలిస్టులకు సంబంధించి తాము సభ్యులుగా కొనసాగుతున్న ప్రెస్ క్లబ్ ల నిర్వహణ సరైన విధంగా లేనప్పుడు కొంతమంది కలిసి ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సంఘాల అనుమతి తీసుకోవాలని లేదన్నది ఎవరైతే అనుమతులు తీసుకోవాలి అని అంటున్న మిత్రులు గమనిస్తే మంచిదని అన్నారు.ప్రెస్ క్లబ్ లు సంఘాలకు అతీతమని అన్నారు.

ప్రెస్ క్లబ్ ఏర్పాటైన తర్వాత సభ్యుల సంక్షేమం అభివృద్ధి కొరకు,బాగోగుల కోసం పని చేస్తుంది,అందులో సమర్థవంతమైన నాయకత్వం ఉందని భావించినప్పుడు తమకు ఇష్టమైన సంఘాల్లో చేరే స్వేచ్ఛ ఉందని అన్నారు.మంథనిలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఆరోపణలు చేస్తున్న వారు ఆలోచించవలసిన అవసరం ఉంది. గ్రామీణ జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. పత్రికా యాజమాన్యాలు వారికి వార్తలు రాయడానికి పాత్రికేయులను ఒక వాహకంగా వాడుకుంటున్నాయని అన్నారు.సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పాత్రికేయులు అదే పత్రిక మీద ఆధారపడితే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయి. ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తమ వ్యాపారాలు చక్కబెట్టుకోవడానికి, తమ వ్యాపారాల వైపు ఎవరూ రాకుండా చూడడానికి క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నారు, సంఘాలు పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు తాము ఏమి చేస్తున్నామో కూడా ఆలోచించుకోవాలని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్యూరోలుగా పనిచేస్తూ నెలనెలా వేతనాలు పొంది వ్యాపారాలు చేసినప్పుడు ఇలాంటివి గుర్తు రావా అని ప్రశ్నించారు. గ్రామీణ విలేకరులు సొంత వ్యాపారాలు చేసుకోకూడదా? అని అన్నారు. అటు యాజమాన్యాలు జీతాలు ఇవ్వక,ఇటు వ్యాపారాలు చేయకపోతే వారి కుటుంబాలు ఎలా నడుస్తాయో ఆలోచించాలని అన్నారు. ఈ విధానం సరైంది కాదని అన్నారు. ఇలా అన్నవారే ఎన్ని వ్యాపారాలు చేశారో తెలుసు చేస్తున్నారో తెలుసు దీని గురించి కూడా చర్చ చేయాల్సి ఉంది.

ఇవాళ రాజకీయాలు పార్టీలకు అనుబంధం గురించి మాట్లాడుతున్నారు. ఈనాడు పదవులలో ఉన్నవారు ప్రెస్ క్లబ్ లో సంఖ్యాబలాన్ని చూపించుకొని పదవులు పొంది వాటిని అనుభవిస్తున్నది ఎవరు? ఈరోజు రాజకీయ పార్టీలకు అనుబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థను పార్టీలకు అనుబంధంగా తీసుకుపోయిందెవరు? గ్రామీణ విలేకరుల సంఖ్య బలాన్ని చూపించి పదవులు పొంది వాటిని అనుభవిస్తున్నది ఎవరు? మాదే అతి పెద్ద సంఘం అని చెప్పుకుంటున్న ఓ సంఘానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో లేరా? జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పనిచేస్తున్నారు కదా. అది రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్ లు ఏర్పాటు చేసుకుంటే ఇది ఆ పార్టీకి అనుబంధం ఈ పార్టీకి అనుబంధం అనడంలోని ఔచిత్యం ఏమిటని అన్నారు. ప్రభుత్వాలకు గౌరవ సలహాదారులు గా పనిచేస్తున్న జర్నలిస్టులు ఆ పార్టీల కండువాలు వేసుకున్నారా? సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్ ల నాయకులు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల వద్దకు వెళ్లడం సమస్యలు విన్నవించడం సహజం. ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరు రాజకీయ పార్టీలో సభ్యత్వాలు తీసుకొని పూర్తి కాలం పనిచేసే వారు కాదు కదా. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన అధికారంలో ఉన్నా లేకున్నా వారి వార్తలు రాస్తూనే ఉంటారు.

అది వారి లక్షణం, అది వారి వృత్తి ధర్మం అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ యూనియన్ ప్రత్యేక తెలంగాణలో జర్నలిస్ట్ యూనియన్ పని చేసిన చేస్తున్న విధానాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న యూనియన్లు పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోత్కూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొడారి మల్లేష్, సహాయ కార్యదర్శి ముదరబోయిన కిషన్, కోశాధికారి గడిపల్లి అజయ్ కుమార్, అశోకన్, వాసు, రాజ్ కుమార్, కాసర్ల శంకర్, లక్ష్మణ్, స్వామి, రవీందర్, శ్రావణ్ డబ్ల్యూ జేఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, తెలంగాణ న్యూస్ ప్రసాద్ లను శాలువాలతో సత్కరించి సన్మానించారు.

Similar News