కార్మికుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త ఉద్యమాలు
కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఐఎఫ్టీయూ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
దిశ, గోదావరిఖని టౌన్ : కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఐఎఫ్టీయూ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని ఆదిత్య హోటల్లో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ. కృష్ణ మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ చట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన మరుక్షణమే 650 జిల్లాల్లో 16 వేల పోలీస్ స్టేషన్ల పరిధిలో హడావుడిగా అమలు చేస్తున్నారన్నారు. మరో 20 కొత్త నేరాలను చేర్చారని మొత్తం మీద 33 కొత్త శిక్షలు 83 కొత్త రకాల జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా నిరాహార దీక్షలు, ధర్నాలు, సమ్మెలు చేసే వారిని అరెస్టులు చేసి జైలుకు పంపే అధికారం పోలీసులకు ఇచ్చారన్నారు.
లేబర్ కోడ్స్ వల్ల దేశంలోని కార్మిక వర్గాన్ని చాకిరి చేసే విధంగా బానిసత్వంలోకి నెట్టే విధంగా ఉన్నాయని, ప్రమాదకరమైన నూతన నేర చట్టాలను నాలుగు లేబరు కోడ్స్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాల సమైక్య ఐ ఎఫ్టీయూ ఉభయ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఈ రాజేందర్ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు ఏ. వెంకన్న, ఎండీ. చాంద్ పాషా, బి.అశోక్, డి. బ్రహ్మానందం టి.శ్రీనివాస్, చిలుక శంకర్, ఈ. రామకృష్ణ, జి.మల్లేశం, ఎం. దుర్గయ్య, బిచ్చయ్య, ప్రసాద్, బుచ్చమ్మ, యాదగిరి, సురేందర్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.