ప్రయాణికుల భద్రత కోసమే ‘మై ఆటో ఈజ్ సేఫ్’
సురక్షితమైన ప్రయాణం భద్రత కోసమే ‘మై ఆటో ఈజ్ సేఫ్’కార్యక్రమం అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
దిశ, జగిత్యాల టౌన్ : సురక్షితమైన ప్రయాణం భద్రత కోసమే ‘మై ఆటో ఈజ్ సేఫ్’కార్యక్రమం అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భాగంగా 1500 ఆటోలకు క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం చేశారు. ఆటోలో ప్రయాణించే వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని, దాంతో తాము సురక్షితంగా ప్రయాణం చేస్తున్నామని ధీమా కలుగుతుందని ఎస్పీ అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో ప్రతి ఆటోకు ఈ క్యూఆర్ కోడ్ అనుసంధానం నిర్వహిస్తామని తెలిపారు.
ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా మాట్లాడినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ కాల్ చేయడమే కాక డ్రైవర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా ఆటోకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటించి స్కాన్ చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ఆర్టీఓ శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ సీఐ కృష్ణారెడ్డి, క్యూఆర్ కోడ్ అప్లికేషన్ డెవలపర్ రమేష్ రెడ్డి, ఆర్ఐ వేణు, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం ఇతర పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఓనర్లు తదితరులు పాల్గొన్నారు.