వచ్చే ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తుందా.. లేదా..? క్లారిటీ ఇచ్చిన కూనమనేని
సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ కు విచ్చేసిన... Kunamaneni hits out at BJP
దిశ, కరీంనగర్: సీపీఐ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ కు విచ్చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో సీపీఐ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందని, దాన్ని అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు శ్రేణులపై ఉందని, తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపికి చుక్కెదురు కాక తప్పదని, ఈ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఏం నిధులు తెచ్చి అభివృద్ధి చేశాడో చెప్పాలని, అసలు సంజయ్ కు పరిజ్ఞానం లేదని, ఇందుకు ఉదాహరణ కరీంనగర్ బోర్డులు కనపడుతున్నాయని, సంజయ్ ఎన్నికల ఆఫిడవిట్ లో ఏమని పేర్కొన్నాడో చెప్పాలని, ఆయన కరీంనగర్ కు ఎంపీ అని, బీజేపీ నాయకులు అమిత్ షా పేరును ముస్లీం పేరుగా మారుస్తావా అని కూనంనేని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి పనిచేసామని, భవిష్యత్ లో కలిసి వస్తే కలిసి ఉంటామని లేకుంటే సీపీఐ, సీపీఎం ఒంటరిగా పోటీ చేయడానికి కూడా వెనకాడబోమని రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో సీపీఐకి సభ్యత్వం కలిగి ఉండి పార్టీ ప్రజా సంఘాలు పనిచేస్తున్నాయని, గెలుపు ఓటమిలను నిర్ణయించే సత్తా సీపీఐకి ఉందని కూనంనేని పేర్కొన్నారు. సీపీఐ రానున్న రోజుల్లో మరింత బలమైన శక్తిగా ఎదిగేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి మంచి గుర్తింపు ఉన్నదని, పోరాటాల ఖిల్లాగా కరీంనగర్ పేరొందినదని, బద్ధం ఎల్లారెడ్డి, అణభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, డాక్టర్ సి.హెచ్. వెంకట్రామారావు లాంటి ఎందరో గొప్ప గొప్ప నాయకులు ఉన్న జిల్లా కరీంనగర్ అని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతున్నదని, కార్పొరేట్, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నదని, ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అమలు చేయడం లేదని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.