కేసీఆర్ కాంగ్రెస్ వాధియే.. ఢిల్లీలో సోనియా గాంధీ కాళ్లు మొక్కిండు : ఆది శ్రీనివాస్
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణను నూటికి నూరుపాళ్ళు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇచ్చిన మాట మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వడం వల్లనే వచ్చిందని, ఆ విషయాన్ని నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించాడని గుర్తు చేశారు. కేసీఆర్ ముమ్మాటికి కాంగ్రెస్ వాదియేనని, రాష్ట్ర అవతరణ అనంతరం కేసీఆర్ కుటుంబంతో సహా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అప్పటి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకు హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.
స్వయంగా కేసీఆర్ అన్న మాటలనే వారి సభ్యులు తప్పుపడుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి, రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిందా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగాన్ని తప్పుపడుతున్నారని, ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాలు కాకముందే ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, నిన్నటి గవర్నర్ ప్రసంగంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపిందన్నారు. 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వబోతున్నామని, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మరింత దగ్గరవుతుందని ఓర్వలేకే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.