Kadambapur road : గోతుల మయంగా కదంబపూర్ రోడ్డు..
సుల్తానాబాద్ మండలంలోని కనుకుల క్రాసింగ్ వద్ద నుండి కదంబాపూర్ గ్రామం వరకు ఇసుక లారీలు, గ్రానైట్ క్వారీలు భారీ వాహనాలు రాకపోకల వల్ల గ్రామంలో ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమై పోయింది.
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలంలోని కనుకుల క్రాసింగ్ వద్ద నుండి కదంబాపూర్ గ్రామం వరకు ఇసుక లారీలు, గ్రానైట్ క్వారీలు భారీ వాహనాలు రాకపోకల వల్ల గ్రామంలో ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమై పోయింది. గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. సుల్తానాబాద్ మండలం, కాల్వ శ్రీరాంపూర్ మండలం, ఓదెల మండలం, జమ్మికుంట ప్రాంతాలకు ఈ రోడ్డు గుండానే ప్రజలు, రైతులు, వాహనాదారులు ప్రయాణం సాగిస్తారు. నిన్న, మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పైన ఉన్న గుంతల్లో నీరు నిలిచి బావులను తలపిస్తున్నాయి. ఈ రహదారి పొడవునా పొలాలు ఉండడం వలన రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. పొలాల వద్దకు రాత్రి వేళలో రైతులు వెళితే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
గ్రామ రైతు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఇసుక లారీలు, గ్రానైట్ క్వారీల లారీలు వెళ్ళడంతో గ్రామంలో వున్న రహదారి పూర్తిగా చెడిపోయిందని, రహదారి మొత్తం గుంతలు ఏర్పడి భారీ వర్షాల కారణంగా రహదారి గుండా వెళ్లే వాహన దారులు చాలా మంది పడిపోయి గాయాలపాలు అవుతున్నారని తెలిపారు. చాలామంది గుంతలలో పడి ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారని, ఇక నైనా గ్రానైట్ క్వారీ యజమానులు రహదారి మరమత్తులు చేయించాలని అన్నారు. లేని యెడల గ్రానైట్ తీసుకువెళ్లే లారీలను అడ్డుకుంటామని గ్రామ రైతు గోస్కుల సదయ్య హెచ్చరించారు.