నాకు టిక్కెట్ రావొద్దని ఇంత కుతంత్రమా : బీఆర్ఎస్ మంథని అభ్యర్థి Putta Madhukar
నాకు మంథని టికెట్ రావొద్దని చాలా మంది కుట్రలు చేశారని, నాలుగు పార్టీలు ఏకమైన సంస్కృతి ఎక్కడైనా ఉందా.. అని జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ ప్రశ్నించారు.
నాలుగు పార్టీలు ఏకమవడం ఎక్కడైనా ఉందా..?
దిశ, మంథని : నాకు మంథని టికెట్ రావొద్దని చాలా మంది కుట్రలు చేశారని, నాలుగు పార్టీలు ఏకమైన సంస్కృతి ఎక్కడైనా ఉందా.. అని జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ ప్రశ్నించారు. మంథని బీఆర్ఎస్ అభ్యర్థిగా పుట్ట మధుకర్ ఖరారైన అనంతరం హైదరాబాద్ నుంచి మంథనికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కమాన్పూర్ మండలం గొల్లపల్లి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంథని అంబేద్కర్ చౌక్ లో జరిగిన సమావేశంలో పుట్ట మధుకర్ ఉద్వేగంతో ప్రసంగించారు.
తనకు టికెట్ రాకుండా చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ నాయకులంతా ముత్తారంలో ఒకే వేదిక మీదకు చేరారని అన్నారు. తనపై రోజుకో కుట్ర, అపవాదులు మోపుతూ.. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నా ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. అన్నం పెట్టిన వాడిని గంజాయి కేసులో ఇరికించాలనుకున్న దొంగ నీతులు చెబుతున్నాడని నిప్పులు చెరిగారు. ఇది చదువుకున్నోడు చేసే పనేనా అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తేనే ఎమ్మెల్యేకు జనం గుర్తొస్తారని, డబ్బు సంచులు సిద్ధం చేస్తారని ఆరోపించారు. ఆయనకు ప్రజాభిమానం కంటే డబ్బు సంచులపైనే నమ్మకం అన్నారు.
తనపై హైదరాబాద్, అమెరికా వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధ్యులను ఎలా పట్టుకోవాలో పోలీసులకే అర్థం కాని రీతిలో కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా మంథనిలో సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారని, పోలీసు ఉన్నతాధికారులే చెప్పిన పరిస్థితి ఉందన్నారు. తనకు టికెట్ వచ్చిందని తెలియగానే ఎంతోమంది ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని పేర్కొన్నారు, ఈ రోజు స్వచ్ఛందంగా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు. 2014లో కంటే కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. తన తర్వాత ఎమ్మెల్యే పదవికి కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గొల్లపల్లి నుంచి మంధని వరకు భారీ ర్యాలీ
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పుట్ట మధూకర్‌కు మంథనికి వస్తున్న సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు కమాన్పూర్ మండలం గొల్లపల్లి తరలివచ్చారు. అక్కడి నుంచి మంథని వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కమాన్‌పూర్, కల్వచర్ల, రాజాపూర్, సెంటనరీ కాలనీ, బేగంపేట్, లద్నాపూర్, పుట్టపాక, శ్రీరాంనగర్, కూచిరాజ్‌పల్లి, గంగాపురి గ్రామాల వద్ద మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ పూలదండలు, శాలువాలతో సత్కరించారు. అభిమానులు గజమాలలు వేసి స్వాగతం పలికారు. ర్యాలీ సందర్భంగా మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిని, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.