న్యాయం చేయకుంటే దేనికైనా తెగిస్తాం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన నిర్వహించారు.

Update: 2025-01-28 09:41 GMT
న్యాయం చేయకుంటే దేనికైనా తెగిస్తాం
  • whatsapp icon

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన నిర్వహించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, నాయకులు మాట్లాడారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిర్వహణ మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 17 ప్రభావిత గ్రామాలైన రామగుండం, కుదనపల్లి, శాలపల్లి, కాజిపల్లి, లక్ష్మీపురం, ఎలకలపల్లి తదితర గ్రామాల ప్రజలకు మౌలికవసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు.

    రామగుండంలో 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విద్యుత్ కంపెనీ ఈ ప్రాంత ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోలేదని నాయకులు ఆరోపించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇచ్చిన వారికి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తున్నా అపాయింట్మెంట్ ఇయ్యలేదని ఆరోపించారు. ఎన్ టీపీసీ విద్యుత్ కంపెనీ సీఎస్ఆర్ నిధులు ఎక్కడో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఖర్చు చేస్తున్నారని, ఈ ప్రాంత ప్రయోజనాలకే ఖర్చు చేయాలని కోరారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు కనీసం కాంటాక్ట్ ఉద్యోగాలైనా ఇచ్చి ఉపాధి కల్పించాలని విన్నవించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, యువకుల ఉపాధి కోసం ఇప్పటికైనా ఎన్టీపీసీ ముందుకు రాకుంటే దేనికైనా తెగిస్తామని యువకులు హెచ్చరించారు.

అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం : కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రజల అభిప్రాయాలను, ఈ ప్రాంతానికి కావలసిన మౌలిక వసతులను అన్నీ పరిగణలోకి తీసుకుంటున్నామని, ఈ ప్రాంతానికి కావలసిన సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పర్యావరణం కోసం ఎక్కువ శాతం చెట్లు నాటడం, దుమ్ము, నీరు కలుషితం కాకుండా కంపెనీ యాజమాన్యాలతో కలిసి ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపడతామన్నారు.

కొట్లాడి కంపెనీ తెచ్చుకున్నాం : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్

ఈ ప్రాంత ప్రయోజనాలు, అభివృద్ధి కోసం ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టును ఇక్కడికి తీసుకు వచ్చానని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, యువకుల ఉద్యోగాల కోసం కంపనీ యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకువస్తానన్నారు. 50 సంవత్సరాల నుండి ఎన్టీపీసీ కంపెనీ ప్రభావిత గ్రామాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంతకు ముందులాగా వారి ఆటలు సాగవని అభివృద్ధి కోసం ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో కావలసిన మౌలిక అస్తుల కోసం కలెక్టర్కు క్షుణ్ణంగా వివరించారు. ఈ ప్రాంతానికి ఇంకెన్నో కంపెనీలు రావాలని, తాము కంపెనీలకు వ్యతిరేకం కాదని, ప్రజల క్షేమమే తమ లక్ష్యం అన్నారు. 


Similar News