పార్టీలో నా స్థానం ఏమిటన్న విషయంలో అసంతృప్తి ఉంది.. జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్న

Update: 2025-04-15 13:01 GMT
పార్టీలో నా స్థానం ఏమిటన్న విషయంలో అసంతృప్తి ఉంది.. జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్న విధంగా 40 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ వస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో విహెచ్ మాత్రమే తనకన్నా సీనియర్ నాయకుడని పార్టీ పరంగా జానారెడ్డి కూడా తనకంటే నాలుగేళ్ల జూనియరే అని అన్నారు. సీనియారిటీకి తగిన గుర్తింపు లేనప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుందని అన్నారు. అంతమాత్రాన పార్టీ మారుతానని అంటే ఎలా అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక నాయకుణ్ని తానే అని శాసనసభలో గానీ, శాసనమండలిలో గానీ కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు ఏమాత్రం తక్కువ గానీ పోరాటం తాను కూడా చేసినట్లు జీవన్ రెడ్డి మాట్లాడారు. పార్టీలో సీనియర్ నాయకులైన ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి లు మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముందని అభిప్రాయపడ్డారు. ఇక అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భారతి తో రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికై కలెక్టర్ తో పాటు ఆర్డీవో కి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని మ్యుటేషన్ లో కూడా వివాదాలకు తావు లేకుండా భూ భారతి రూపొందించినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.

Similar News