ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యంతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్ పమేలా సత్పతి
ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యంతో కూడిన విద్యను
దిశ,కరీంనగర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నామని,ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తద్వారా విద్యార్థులు భవిష్యత్తులో వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి నిష్ణాతులవుతారని అన్నారు. కొత్తపల్లి(హవేలీ)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం ప్రార్థన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు.పాఠశాలలో విద్యా విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వంద ప్రభుత్వ పాఠశాలల్లోని 200 మంది ఉపాధ్యాయులకు లైఫ్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి గదిలో ప్రయోగాత్మక విద్యను బోధిస్తారని అన్నారు. ముఖ్యంగా భూమి విస్తీర్ణం, నేల రకం, కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక, సేంద్రియ ఎరువులు, వాతావరణం అంచనా, మార్కెటింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రయోగాత్మక బోధన ఈ లైఫ్ స్కిల్స్ విద్యలో భాగమని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అవగాహన పెంపొందించుకొని భవిష్యత్తులో ఆయా రంగాలలో నిష్ణాతుల అవుతారని తెలిపారు. వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకొని స్థిరపడతారని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు స్వయంగా ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ లో విత్తనాలు నాటుతున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, జన్య ఫౌండేషన్ మేనేజర్ సురేంద్ర కుమార్, ఎంఈఓ అజీమ్, తహసీల్దార్ రాజేష్, ప్రధానోపాధ్యాయురాలు వెంకట పద్మా దేవి పాల్గొన్నారు.