వివాదాస్పదంగా సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూమి లీజు వ్యవహారం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూమి లీజు

Update: 2025-03-27 02:09 GMT
వివాదాస్పదంగా సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూమి లీజు వ్యవహారం
  • whatsapp icon

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూమి లీజు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ట్రస్టు భూముల పై కన్నేసిన ఓ వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా ఆ భూములను ప్రైవేట్ వ్యక్తుల దారికోసం ధారాదత్తం చేశారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా కొంత మంది వ్యక్తులు కలిసి మరో ట్రస్టును ఏర్పాటు చేసి ఆశ్రమ భూమిని లీజుకు అప్పగించడం ..కోటి రూపాయలు ధర నిర్ణయించి సుమారు రూ. 70 లక్షలు అడ్వాన్స్ తీసుకుని దారికోసం లీజు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం ఆశ్రమ భూమిలో నుంచి దారి తీసి ఇవ్వాల్సిన సభ్యులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి నుంచి దారితీయడంతో ఆశ్రమ భూముల అక్రమ లీజు బాగోతం వెలుగు చూసింది. ఆశ్రమ ట్రస్టు సభ్యులకు సంబంధం లేకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు దారి కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్టు పై బ్యాంకులో ఖాతా తెరిచి ఆ ట్రస్టు పేరుతో ఆశ్రమ భూములను లీజుకు ఇవ్వడం.. లీజు డబ్బులను ఆశ్రమానికి సంబంధం లేని ట్రస్ట్ ఖాతాలో జమచేయడంపై ఆశ్రమ కమిటి సభ్యులు మండి పడుతున్నారు.

లీజుకు ఆశ్రమ భూమి.. దారి ప్రభుత్వ భూమిలో ...

సచ్చిదానంద స్వామి ఆశ్రమ భూములపై కన్నేసిన కొంతమంది ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రైవేటు వ్యక్తులకు ఆశ్రమ భూములను లీజుకు ఇవ్వడం ఆశ్రమంలో కలకలం రేపింది. అందుకు ఆశ్రమ ఆవరణలోని ఓ దేవాలయానికి కమిటీని ఏర్పాటు చేయడం ఆజ్యం పోయగా... అదే అదనుగా భావించిన ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న కొంతమంది వ్యక్తులు ఓ ట్రస్టును రిజిస్టర్ చేసుకొని అక్రమ వ్యవహారానికి తెరలేపినట్టు తెలుస్తుంది. కమిటీలో కొంతమంది వ్యక్తులు చైర్మన్ మిగతా ఆశ్రమ సభ్యుల నిర్ణయం లేకుండా వ్యక్తిగతంగా ప్రైవేటు వ్యక్తులకు దారి కోసం ఆశ్రమ భూమిని ధారాదత్తం చేశారు. రూ.99లక్షలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్న సదరు వ్యక్తులు 99 ఏళ్ల వరకు దారి ఇచ్చేందుకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు . సుమారు రూ. 70 లక్షల వరకు అడ్వాన్సుగా తీసుకున్న సదరు వ్యక్తులు దారి ఇచ్చే క్రమంలో ఆశ్రమ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో నుంచి దారితీయడంతో ఆశ్రమ భూముల అక్రమ లీజు వ్యవహరం వెలుగు చూసి ఆశ్రమ సభ్యులను కలవరపరిచింది. కోట్ల రూపాయల విలువచేసే ఆశ్రమ భూములను అక్రమంగా లీజుకు ఇవ్వడం పై ట్రస్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్జాగా ప్రభుత్వ భూమిలో దారి

ట్రస్ట్ పేరుతో ఆశ్రమ భూముల ను అక్రమంగా లీజుకు రాసి ఇచ్చిన ట్రస్టు సభ్యులు ప్రభుత్వ భూమిలో నుంచి దారి వేయడం వివాదాస్పదంగా మారి ఇరకాటంలో చిక్కుకున్నారు. అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ఆశ్రమ భూమి లీజు వ్యవహారానికి తెరతీసిన వ్యక్తులు రూ. 99 లక్షలకు అగ్రిమెంట్ చేసుకోవడం ఇప్పుడు ఆశ్రమంలో అలజడి సృష్టిస్తుంది. ఇప్పటికే ఆశ్రమాన్ని ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు కుట్రలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ లీజు వ్యవహరం ఆశ్రమ సొసైటీని కుదిపేస్తుంది. ఆశ్రమం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు భూములను అప్పజెప్పడం ప్రభుత్వ భూమిలో నుంచి ప్రహరి గోడలు ధ్వంసం చేసి దారి వేయడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. మరి అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Similar News