లోన్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సంస్థలు

మీకు వ్యాపారానికి, గృహ నిర్మాణానికి లోన్ కావాలా, అతి తక్కువ వడ్డీ రేటుతో రుణ సదుపాయం కల్పిస్తామని పలు రుణ సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Update: 2025-03-24 02:43 GMT
లోన్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సంస్థలు
  • whatsapp icon

దిశ, జమ్మికుంట : మీకు వ్యాపారానికి, గృహ నిర్మాణానికి లోన్ కావాలా, అతి తక్కువ వడ్డీ రేటుతో రుణ సదుపాయం కల్పిస్తామని పలు రుణ సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రూ.7 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లోన్ సదుపాయం, కాల పరిమితి 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్లు ఇప్పిస్తామంటూ బహిరంగ ప్రకటన చేస్తున్నాయి. బాధితుల నుంచి వేలాది రూపాయల వసూలు చేస్తూ తీరా సమయానికి వివిధ కారణాలతో రుణం మంజూరు కాలేదంటూ చేతులెత్తేస్తున్నారు.

దీంతో బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జమ్మికుంట పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యాపార కూడళ్లు, హోటళ్లు, 10 మంది గుమి కూడేచోట కరపత్రాలను గోడలకు అంటిస్తున్నారు. వారి ప్రచారం కొనసాగిస్తూ అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఆ ప్రకటనలు చూసి ఆ కరపత్రాల్లో పేర్కొన్న సెల్ నంబర్లకు ఫోన్లు చేయగా, సదరు సంస్థకు చెందిన ఓ వ్యక్తి బాధితుడి దగ్గరికి వెళ్తారు.

అడ్డగోలుగా వసూళ్లు..

లోన్ అవసరమున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల బ్యాంక్ స్టేట్ మెంట్లు, పాన్ కార్డుల జిరాక్స్‌లను తీసుకుంటారు. అనంతరం లాగిన్ పేరుతో మొదటగా రూ.3వేలను వసూలు చేస్తారు. బాధితుల వద్ద నగదు లేకుంటే, డబ్బులను సంస్థకు సంబంధం లేని వ్యక్తుల ఫోన్ పేలకు చెల్లించుకుంటారు. రుణం పొందాలనుకుంటున్న ఖాళీ స్థలాల, ఇళ్లను సర్వే చేసి కొలతల పేరుతో టెక్నికల్ టీం మరో రూ.1500 నగదు క్యాష్‌గా తీసుకుంటారు. ఇక్కడ నగదు క్యాష్ కావాలంటూ మొదటనే బాధితుడికి చెప్తారు.

మూడో దఫాలో వెరిఫికేషన్ పేరుతో మరో వ్యక్తి వచ్చి ఏం బిజినెస్ ఉంది, లోన్ ఎలా కడతారు, డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా లేవా అంటూ వెరిఫికేషన్ చేసినట్లు నటిస్తూ బాధితుడి లోన్ బడ్జెట్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు నగదు రూపకంగా తీసుకుంటూ ఎవరికీ చెప్పొద్దని, డబ్బులు ఇచ్చిన విషయం లీక్ అయితే లోన్ మంజూరు కాదంటూ చెప్పి వెళ్లిపోతాడు. రెండు, మూడు రోజులు గడచిన తర్వాత బాధితుడికి సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి ఏదో ఒక కారణం చెప్పి లోన్ మంజూరు కాలేదని చేతులెత్తేశారు.

లబోదిబోమంటున్న బాధితులు..

దీంతో ఏ విధంగానైనా రుణం పొంది ఇంటి నిర్మాణాలు, చిరు వ్యాపారాలు చేసుకుందామనుకునే వారికి నిరాశ ఎదురవుతుంది. అన్ని రకాల పేర్లతో వేలాది రూపాయలు నష్టపోయి తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో బాధితులు పడిపోతున్నారు. పదుల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ లోన్ సంస్థలు అందులో పనిచేస్తున్న సిబ్బందికి టార్గెట్లు పెడుతూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం బహిరంగంగా నడుస్తోంది. బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బుతోనే ఆఫీసు కిరాయిలు, ఉద్యోగుల జీతాలు పోను కొంత నగదును వెనుకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కాగా, లబ్ధిదారులు సంస్థల్లో పనిచేస్తున్న పరిచయం ఉన్న ఉద్యోగస్తులను నమ్మి డబ్బు చెల్లిస్తే తీరా సమయానికి లోన్లు మంజూరు కాకపోవడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. కొందరైతే లోన్ మంజూరు కాకపోవడంతో వారు ఉద్యోగాలను మానేసి ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అమాయక ప్రజలను మోసం చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

లోన్ ఇస్తామంటే రూ.5 వేలు ఇచ్చాను..

నేను ఇల్లు కొన్నాను. ఆ ఇంటి పై లోను తీసుకొని ఈఎంఐ ద్వారా లోను పూర్తి చేస్తానని ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించాను. అయితే ముందుగా ఖర్చుల పేరుతో రూ.5వేల వరకు ఇచ్చాను. అయినా లోన్ రాలేదు. దీంతో మరికొద్ది రోజుల తర్వాత మరో సంస్థ ద్వారా లోను తీసుకుని రెగ్యులర్‌గా కిస్తీలు చెల్లిస్తున్నాను. - మహమ్మద్ ఫజల్ రహమాన్, జమ్మికుంట

Similar News